మమత స్టోరీలో ట్విస్ట్: రాజీనామా చేయని త్రివేది

మమతా బెనర్జీ గానీ, ప్రధాని గానీ చెప్తే తాను మరుక్షణమే రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. చార్జీల పెంపును ఆయన మరోసారి సమర్థించుకున్నారు. దేశ ప్రయోజనాలను, రైల్వే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ పనిచేసినట్లు ఆయన తెలిపారు. తాను క్రమశిక్షణ గల పార్టీ సైనికుడినని, పార్టీ చెప్పినట్లు నడుచుకుంటానని ఆయన అన్నారు. దినేష్ త్రివేది స్థానంలో ముకుల్ రాయ్‌ని రైల్వే మంత్రిగా తీసుకోవాలని తాను ప్రధానికి లేఖ రాసినట్లు మమతా బెనర్జీ చెప్పారు.
మమతా బెనర్జీని ఇరకాటంలో పెట్టేందుకే దినేష్ త్రివేది రాజీనామా డ్రామా నడిచినట్లు చెబుతున్నారు. త్రివేది వ్యవహారంపై గురువారం రాజ్యసభ రగడ చోటు చేసుకుంది. దీంతో రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. లోకసభలోనూ ఇదే విషయంపై పాలక, ప్రతిపక్షాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మమతా బెనర్జీ నుంచి తమకు లేఖ మాత్రమే వచ్చిందని కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. త్రివేది నుంచి రాజీనామా లేఖ అందలేదని రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. త్రివేది రాజీనామా చేశారా, లేదా అని విపక్షాలు వేసిన ప్రశ్నకు వారు ఆ విధంగా ప్రతిస్పందించారు.












Click it and Unblock the Notifications