వైయస్ అల్లుడ్ని అరెస్టు చేయాలి: తె.క్రైస్తవ సంఘాలు

హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో బుధవారం తెలంగాణ క్రైస్తవ సంఘాల సమాఖ్య, క్రైస్తవ హక్కుల పరిరక్షణ ఫ్రంట్, ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కాన్ఫరెన్స్, క్రైస్తవ గుడిసెవాసుల సంఘం విలేకరుల సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు మాట్లాడారు. రాజేంద్రనగర్ మండలం మణికొండలో అనాథలకు కేటాయించిన నాలుగెకరాల భూమిని బ్రదర్ అనిల్ కుమార్ హస్తగతం చేసుకున్నారని ఆరోపించారు.
తన మామ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ స్థలాలను పేదల పేరుతో కబ్జా చేశారని పేర్కొన్నారు. వాటిని ప్రశ్నిస్తే బెదిరింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. వీటిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. వైయస్ అధికారంలో ఉన్నప్పుడు అనాథాశ్రమం పేరిట కేటాయించిన స్థలాన్ని ప్రభుత్వం వెంటనే స్వాధీనపరుచుకోవాలని డిమాండ్ చేశారు.
క్రైస్తవులు, అనాథల సంక్షేమం కోసం అనేక సంస్థలు పని చేస్తుండగా ఆయా సంస్థలను వదిలేసి అనిల్‌కు కేటాయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వైయస్ ప్రభుత్వం హయాంలో అనిల్ పేదల భూములు, క్రైస్తవుల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ఆయన క్రైస్తవ సంస్థలు, విదేశీ మిషనరీలు, పాస్టర్లను మోసం చేస్తూ దేవుడి పేరును అవమానిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ పాస్టర్లను అణిచివేసేందుకు ప్రయత్నించారన్నారు.












Click it and Unblock the Notifications