జైలులో భాను కిరణ్ హంగామా, సందడే సందడి

సూరితో కలిసి ఉన్న ఖైదీలు ఇప్పుడు భాను చుట్టూ చేరి ఆసక్తిగా మాట్లాడుకోవడం కనిపించిందని జైలు వర్గాలు తెలిపాయి. భానును చర్లపల్లి జైలులో శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత సిఐడి పోలీసులు తీసుకెళ్లారు. ప్రస్తుతం చర్లపల్లి మానస విభాగంలో ఉన్న భానును ముందు చంచల్‌గూడ జైలుకు తీసుకెళ్లాలని పోలీసులు భావించారు. కానీ ఇటీవలి కాలంలో చంచల్‌గూడ జైలులో విఐపి విచారణ ఖైదీల సంఖ్య పెరిగింది. పైగా రెండు ప్రధాన అంశాలను దృష్టిలో పెట్టుకుని చంచల్‌గూడ జైలుకు భానును తరలించలేదని పోలీసు వర్గాలు చెప్పినట్లు పత్రికలు రాశాయి.
బెయిల్ రద్దు కావడంతో ఏ క్షణమైనా జగన్ సంస్థల ఆడిటర్ విజయసాయిరెడ్డి కోర్టుకెళ్లి లొంగిపోయిన మరుక్షణం చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలిస్తారు. ఈ జైలులో ఈ ఏడాది జనవరి 2నుంచి విజయసాయిరెడ్డి ఉంటున్నారు. గత వారం బెయిల్‌పై ఆయన విడుదలయ్యారు. సూరి హత్య కేసులో నిందితుడు భానును, జగన్ అక్రమ ఆస్తుల కేసులో రెండవ నిందితుడు విజయసాయిరెడ్డిని ఒక జైలులో ఉంచడం క్షేమకరం కాదని నిఘావర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు సిఐడి పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించినట్లు చెబుతున్నారు.
చంచల్‌గూడ జైలులో సీనియర్ ఐఏఎస్ అధికారి బిపి ఆచార్యతోపాటు బళ్లారికి చెందిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, శ్రీనివాసుల రెడ్డి మరి కొంతమంది విఐపి విచారణ ఖైదీలున్నారు. గాలి, విజయసాయిరెడ్డిలు వైఎస్ కుటుంబానికి సన్నిహితులు కావడం వల్ల, మారిన రాజకీయ పరిస్థితుల్లో సూరిని హత్య చేసిన కేసులో నిందితుడు భానును చంచల్‌గూడకు తరలించడం ప్రమాదమని పోలీసు వర్గాలు నిర్ణయానికి వచ్చాయి.












Click it and Unblock the Notifications