యుపిఏ-ఎన్డీయే: జగన్, కెసిఆర్‌లకు 'రాష్ట్రపతి' తలనొప్పి

ప్రస్తుత పరిస్థితులను చూస్తే తృతీయ ఫ్రంట్ ఏర్పాటయ్యే పరిస్థితి కనిపించడం లేదు. పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్టులు బోల్తా పడ్డ తర్వాత పార్టీని రక్షించుకునే పనిలో పడ్డారు. వారు ఇప్పుడు తృతీయ ఫ్రంట్ గురించి ఆలోచిస్తున్నట్లుగా కనిపించడం లేదు. మూడో వ్యక్తిని నిలబెట్టేందుకు కొన్ని పార్టీలో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి కూడా సఫలం అయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. దీంతో ఇప్పుడు అయితే ఎన్డీయే లేదా యుపిఏకి మద్దతివ్వాలి.
పార్టీ తన కుటుంబానికి అన్యాయం చేసిందని కాంగ్రెసును వీడి సొంత కుంపటి పెట్టుకున్న జగన్ యుపిఏకి మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ మద్దతు ఇచ్చిన పక్షంలో కాంగ్రెసు పార్టీ నేతలు గత కొంతకాలంగా చేసిన వ్యాఖ్యలు నిజమవుతాయి. జగన్ ఎప్పటికైనా కాంగ్రెసులో కలిసే వారే అని కాంగ్రెసు నేతలు పలుమార్లు చెప్పారు. అదే సమయంలో జగన్ అండ్ కో తెలుగుదేశం పార్టీ కాంగ్రెసుతో కుమ్మక్కైందని విమర్శిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో యుపిఏకి మద్దతిస్తే జగన్ తమవైపుకు వస్తారన్న కాంగ్రెసు నేతల వ్యాఖ్యలు నిజమవడమే కాకుండా టిడిపిపై చేసిన కుమ్మక్కు వ్యాఖ్యలు బెడిసి కొట్టడంతో పాటు వైయస్సార్ కాంగ్రెసును చంద్రబాబు నిలదీసే పరిస్థితి వస్తుంది. ఎన్డీయే అభ్యర్థికి మద్దతిస్తే మతతత్వ పార్టీకి మద్దతిచ్చారనే అపవాదు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే జగన్ గతంలో చేసిన పలు వ్యాఖ్యలను చూస్తే యుపిఏకు మద్దతిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
బిజెపితో జగన్ కుమ్మక్కయ్యారనే ప్రచారం గతంలో జరిగినప్పుడు అతను, తాను భవిష్యత్తులో బిజెపితో కలిసే ప్రసక్తే లేదని చెప్పారు. అంతేకాదు యుపిఏతో కలిసే విషయంపైనా ఆయన హింట్ ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ప్రస్తుతం ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల బలం ఉంది. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల తర్వాత ఎంపీల బలం రెండుకు చేరడంతో పాటు ఎమ్మెల్యేల సంఖ్య పదహారు లేదా అంతకంటే ఎక్కువ అవుతుంది.
ఇక టిఆర్ఎస్ పరిస్థితి కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి భిన్నంగా ఏమీ లేదు. అయితే ఎన్డీయేకు మద్దతివ్వడానికి కాస్త వెసులుబాటు ఉంది. బిజెపి తెలంగాణకు అనుకూలంగా ఉండటంతో ఆ పార్టీ ప్రతిపాదించే రాష్ట్రపతి అభ్యర్థికి ఓటు వేయవచ్చు. కానీ పాలమూరులో బిజెపి గెలుపు తర్వాత ఇరుపార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై మరొకరు బహిరంగ విమర్శలు చేసుకునే స్థాయికి చేరుకున్నాయి.
త్వరలో జరగనున్న పరకాల ఉప ఎన్నికలలో నువ్వా నేనా అనుకుంటున్నారు. ఇరు పార్టీలో అక్కడ గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో బిజెపి గెలవకుండా టిఆర్ఎస్, టిఆర్ఎస్ గెలవకుండా బిజెపిలు శాయశక్తులా కృషి చేస్తున్నాయట. దీంతో ఎన్డీయే అభ్యర్థికి తెరాస ఓటు వేసే అవకాశాలు కనిపించడం లేదు.
అదే సమయంలో యుపిఏకి మద్దతిస్తే మాత్రం టిఆర్ఎస్ తెలంగాణ ప్రజల్లో విశ్వాసం కోల్పోతుంది. గత రాష్ట్రపతి ఎన్నికలలో కెసిఆర్ యుపిఏకి మద్దతిచ్చారు. అప్పుడు పొత్తు ఉంది కాబట్టి సానుకూలంగా జరిగింది. కానీ తెలంగాణపై యుపిఏ ఆధ్వర్యంలోని కేంద్రం మాట మార్చినందువల్ల వారికి మద్దతిస్తే టిఆర్ఎస్ పరువు పోతుంది. దీంతో విభేదాలు ఉన్నప్పటికీ ఎన్డీయే అభ్యర్థికి మద్దతిస్తారా లేదా అనేది ముందు ముందు తేలనుంది.












Click it and Unblock the Notifications