ప్రత్యర్థుల మాట: కిరణ్ రెడ్డి ప్రభుత్వం కూలుతుందా?

గురువారంనాడు మాజీ మంత్రి పి. శంకరరావు అదే విషయాన్ని ఘాటుగా చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి పని జూన్ 15వ తేదీ తర్వాత అయిపోతుందని ఆయన అన్నారు. జూన్ 15వ తేదీన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే శంకరరావు ఆ వ్యాఖ్య చేశారని అందరికీ అర్థమవుతూనే ఉంది. తాజాగా, శుక్రవారం తెలంగాణ నగారా సమితి శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి అదే మాట అన్నారు. ఉప ఎన్నికల తర్వాత మధ్యంతరం తప్పదని ఆయన అన్నారు.
అంటే, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోవడం ఖాయమని ఆయన అన్నారు. తాము తెలంగాణలో మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన తప్పదని ఆయన అన్నారు. తెలంగాణ సాధన కోసం కాకుండా తెలంగాణ పార్టీలు బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. అయితే, కాంగ్రెసు పార్టీ నాయకులు మాత్రం ప్రభుత్వం పడిపోతుందనే వాదనలను కొట్టి పారేస్తున్నారు.
ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకుంటామని రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి దీమా వ్యక్తం చేస్తున్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అదే మాట అంటున్నారు. అయితే, చిరంజీవి మాటల్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ఐదు స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను కూడా ఆయన తన మీద వేసుకున్నారు.
ఉప ఎన్నికల్లో తగిన స్థానాలు గెలుచుకోవాలనే పట్టుదలతో చిరంజీవి, బొత్స సత్యనారాయణ, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు విభేదాలతో కాలం వెళ్లబుచ్చిన ఈ ముగ్గురు నేతలు ఇప్పుడు ఐక్య రాగం పలుకుతున్నారు. విస్తృతంగా ఎన్నికల ప్రచార పర్యటనలు చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై గతంలో ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి నిప్పులు చెరుగుతున్నారు.












Click it and Unblock the Notifications