అలా ఐతే శాల్తీలే ఉండేవి కావు: జగన్ వ్యాఖ్యలపై జెసి

ఆళ్లగడ్డ నియోజకవర్గ పర్యవేక్షకునిగా జెసిని నియమిస్తూ బొత్స లేఖను అందజేశారు. అనంతరం జెసి విలేకరులతో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. చట్ట ప్రకారమే సిబిఐ అధికారులు చర్యలు తీసుకుంటారని.. దీంతో కాంగ్రెస్ పార్టీకీ, ప్రభుత్వానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీకి కుట్రలు చేసే అవసరం లేదని.. కుట్రలు చేస్తే శాల్తీలే ఉండేవి కావని జెసి అన్నారు. జగన్‌ను అరెస్టు చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తేలిగ్గా కొట్టి పారేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని చెప్పారు.
కాగా ఉప ఎన్నికలు జరిగే 18 స్థానాల్లో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకొంటుందని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఎంపి ఆస్కార్ ఫెర్నాండెజ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం కనబరుస్తున్నారని చెప్పారు. బుధవారం ఉదయం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని గోరంట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాహిత పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆస్కార్ మాట్లాడారు.
బలహీనవర్గాలు, రైతులు, ఎస్సీ, ఎస్టీ, చేతి వృత్తుల వారికి అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని ఆయన స్పష్టం చేశారు. ప్రత్తిపాడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సుధాకర్‌బాబును నాయకులందరీ ఆశీర్వాదంతో పార్టీని బలపర్చాలని కోరారు. ఉప ఎన్నికలు జరిగే 18 నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహిస్తామని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు. ఉప ఎన్నికల బరిలో నిలిచిన ప్రతి అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
తాము కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంటామని, అందుకోసం ఏ ప్రాంతానికైనా, మరే ర్రాష్టానికైనా వెళ్లేందుకు సిద్ధమని తెలంగాణ ప్రాంత ఎంపీ బలరాంనాయక్ అన్నారు. ఈ పాదయాత్రలో ఎంపీ రాయపాటి సాంబశివరావు, మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, కాసు వెంకట కృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యులు కేవీపీ, జేడీ శీలం, ఎం ఏ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications