సిబిఐ వేధించిందా... అడిగిన జడ్జి, అదేం లేదన్న జగన్

దీనిపై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. రాత్రంతా జగన్ దిల్ కుషా అతిథి గృహంలోనే ఉన్నారు. ఉదయం సిబిఐ అధికారులు అతనికి వైద్య పరీక్షలు చేయించి, అనంతరం పదిన్నర గంటల ప్రాంతంలో నాంపల్లి ప్రత్యేక కోర్టుకు తరలించారు. సిబిఐ తరఫున అశోక్ బాన్, జగన్ తరఫున ముకుల్ రోహత్గీ, సుశీల్ కుమార్ వాదిస్తున్నారు. సిబిఐ తరఫు న్యాయవాది కస్టడీ అడుగుతుండగా, జగన్ తరఫు న్యాయవాది అవసరం లేదని చెబుతున్నారు.
సిబిఐ అధికారులు ఏమైనా వేధించారా అని కోర్టులోకి వచ్చిన అనంతరం జడ్జి జగన్‌ను అడిగారు. అందుకు జగన్ అదేమీ లేదని సమాధానం చెప్పారు. కాగా తొలి ఛార్జీషీటులో పేర్కొన్న పదమూడు మంది నిందితులలో జగన్, విజయ సాయి రెడ్డి మినహా మిగిలిన పదకొండు మందికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
నాంపల్లి కోర్టుకు జగన్ బాబాయి వైయస్ వివేకానంద రెడ్డి, సతీమణి వైయస్ భారతి వచ్చారు. న్యాయవాదులతో కోర్టు హాలు కిక్కిరిసి పోయింది. కోర్టు హాలు పూర్తిగా నిండిపోవడంతో విచారణ జరిపేందుకు వచ్చిన జడ్జి కేసుతో సంబంధం లేని న్యాయవాదులు బయటకు వెళ్లాలని ఆదేశించారు. దీంతో కొద్దిసేపు గందరగోళం చెలరేగింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జడ్జి తన చాంబరుకు వెళ్లిపోయారు. ఆ తర్వాత కేసుతో సంబంధం ఉన్న న్యాయవాదులే కోర్టులో ఉండిపోయారు. ఆ తర్వాత వాదనలు ప్రారంభమయ్యాయి.
జగన్ ఆస్తుల కేసులో తొలి చార్జీషీటులో పేర్కొన్న పదమూడు మంది నిందితులను సిబిఐ కోర్టులో హాజరుపర్చింది. నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డి కస్టడీ ఆదివారంతో ముగియడంతో సిబిఐ కోర్టుకు హాజరుపర్చింది. ఇదే కేసుతో సంబంధమున్న బిపి ఆచార్యను కూడా హాజరుపర్చింది. కోర్టు నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలకు ఈ నెల 30వ తేది వరకు రిమాండ్ విధించింది.












Click it and Unblock the Notifications