'విజయమ్మ'పై చిరంజీవి కామెంట్, అధినాయకుడుపై నో

Chiranjeevi
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ సానుభూతితో ఓట్లు రాబట్టుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే చిరంజీవి విమర్శించారు. ఆయన శుక్రవారం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సానుభూతితో ఓట్లు రాబట్టుకోవాలనే ప్రయత్నాలు ఫలించవన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హత్యపై వేరేవాళ్లు కుట్ర చేశారనడం సరికాదన్నారు. వైయస్ హెలికాప్టర్ ప్రమాదంపై ప్రజలలో అనుమానాలు రేకెత్తించి తమ అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. విజయమ్మ స్థాయికి ఇలాంటి తక్కువస్థాయి రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఆమె తన స్థాయిని మరిచి రాజకీయాలు చేస్తున్నారన్నారు.

వైయస్ జగన్ జైలు నుంచి బయటకు రాడన్నారు. జగన్ పైన కాంగ్రెసు కుట్ర పన్నుతుందన్నది అవాస్తవమన్నారు. రాజకీయ లబ్ధి కోసమే వైయస్ విజయమ్మ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసింది కాంగ్రెసు పార్టీయే అన్నారు. అవి ఏ ఒక్కరివి కావన్నారు. రాజకీయ లబ్ధి కోసం విజయమ్మ ప్రచారం అన్నారు.

జడ్జి లంచం తీసుకొని బెయిల్ ఇవ్వడం చాలా దురదృష్టకరమని చిరంజీవి అన్నారు. ఆయన లంచం తీసుకుంటే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయమూర్తులే ఇలా ఉంటే తమకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రజలు అభద్రతా భావానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. న్యాయవ్యవస్థలు నమ్మకం కలిగించాలన్నారు. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకొనైనా మిగతా న్యాయమూర్తులు సక్రమంగా వ్యవహరించాలన్నారు. న్యాయస్థానాన్ని దైవంగా భావించాలని సూచించారు.

నందమూరి హీరో బాలకృష్ణ తాజా చిత్రం అధినాయకుడుపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబంపై కాంగ్రెసు పార్టీకి అభిమానం ఉందని కేంద్ర సహాయ మంత్రి పురంధేశ్వరి అన్నారు. ఆమె శుక్రవారం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోసమే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని ఆమె ఆరోపించారు. ఓదార్పుయాత్రను రాజకీయ యాత్రగా మార్చవద్దని జగన్‌కు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచించారని చెప్పారు. వైయస్ పైన అభిమానంతో రెండుసార్లు పిసిసి చీఫ్‌గా, రెండుసార్లు ముఖ్యమంత్రిగా కాంగ్రెసు చేసిందన్నారు. అభిమానంతోనే కడప జిల్లాకు వైయస్సార్ పేరు పెట్టినట్లు చెప్పారు.

ఐక్యమత్యంగా పార్టీ వ్యవహరిస్తే ఎన్నికలలో ఓడిపోదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో అన్నారు. కాంగ్రెసు పార్టీలో హద్దులు మీరిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. క్యాడర్‌కు న్యాయం చేయలేని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం చేస్తారన్నారు. కాగా సిఎం నర్సాపురం నుండి ఉప ఎన్నికల ప్రచారం కోసం రామచంద్రాపురం బయలుదేరి వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+