వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనంత అర్బన్: దూసుకుపోతున్న జగన్ పార్టీ అభ్యర్థి

By Pratap
|
Google Oneindia TeluguNews

Gurunath Reddy
అనంతపురం: అనంతపురం అర్బన్ శానససభా నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి గుర్నాథ్ రెడ్డి దూసుకుపోతున్నారు. కాంగ్రెసు అభ్యర్థి ముర్షిదా బేగంకు సొంత పార్టీ నాయకుల నుంచే సహకారం అందడం లేదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మహాలక్ష్మి శ్రీనివాస్‌కు కూడా సొంత పార్టీ నాయకుల నుంచి ఆశించినంత సహాయం లభించడం లేదు. ఇది గర్నాథ్ రెడ్డికి సానుకూల వాతావరణాన్ని కల్పిస్తోంది.

అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి ఇప్పటి వరకూ 14 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో తొమ్మిది సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. సిపిఐ అభ్యర్థి రెండు మార్లు, సిపిఎం అభ్యర్థి ఒక మారు, టిడిపి అభ్యర్థి రెండు సార్లు విజయం సాధించారు. 1969లో నిర్వహించిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నిక రెండవది. నియోజకవర్గంలో 1,88,116 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 93,684 మంది మహిళలు, 94,432 మంది పురుషులు ఉన్నారు. నగర శివారు, అర్బన్ ప్రాంతాల్లో వామపక్ష పార్టీలకు మంచి పట్టు ఉంది. వామపక్ష పార్టీల్లో ఒకటైన సిపిఐ టిడిపికి మద్దతు ఇస్తుండగా, లోక్‌సత్తా మద్దతుతో సిపిఎం అభ్యర్థి వి.రాంభూపాల్ బరిలో ఉన్నారు.

కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేస్తున్న మైనార్టీ అభ్యర్థి ముర్షీదా బేగం గృహిణి. ఆమె తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. ఆమెకు రాజకీయాలు కొత్తే. ఈమె భర్త కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవుల్లో పనిచేసి ప్రస్తుతం గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. వాస్తవానికి ఎంపి అనంత వెంకట్రామిరెడ్డి సోదరుడికి మొదట కాంగ్రెస్ టికెట్ ఖరారైంది. అయితే చివరి నిమిషంలో మైనారిటీ మహిళను బరిలో దింపాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. దీంతో ముర్షిదా బేగంకు టికెట్ ఖరారు చేసింది.

పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ ఆశావహులను కలుపుకుపోవడంతో సీనియర్ నేతలు చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితమివ్వలేదనే చెప్పాలి. దీంతో ముర్షిదా బేగం ఎదురీదుతున్నారు. చాలా చోట్ల ప్రచారానికి ద్వితీయశ్రేణి నాయకులు, వార్డుల ఇంచార్జిలు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ తరఫున ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ప్రచారం చేశారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సైతం ప్రచారం చేశారు. మంత్రి శైలజానాథ్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.

తెలుగుదేశం అభ్యర్థి మహాలక్ష్మి శ్రీనివాస్ గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీచేసి ఓటమి చవిచూశారు. మరోసారి ఆయన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. తెలుగుదేసం అభ్యర్థి తరఫున పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రెండు సార్లు ఎన్నికల ప్రచారం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, కందికుంట ప్రసాద్ తదితరులు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం, ముఖ్య నాయకుల పర్యటనల్లో అంతా కలసి ప్రచారం చేస్తున్నారు. అయితే రోజువారీ ప్రచారంలో మాత్రం ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. నగరంలో పార్టీకి ఉన్న ఓటుబ్యాంక్, మైనారిటీలు, బడుగు బలహీనవర్గాల ఓట్లపై టిడిపి ఆశలు పెట్టుకుంది.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గురునాథరెడ్డికి మహిళలు, యువత నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ప్రచారంలో గురునాథరెడ్డి దూసుకుపోతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రచారం చేశారు. జగన్ అరెస్టు అనంతరం ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల చేసిన ప్రచారానికి అనూహ్య స్పందన లభించింది. సిపిఎం తరపున బరిలో ఉన్న వి. రాంభూపాల్ శివారు ప్రాంత ఓటర్లతో పాటు పట్టణ ప్రాంతంలోని ఓట్లపై దృష్టి సారించారు.

అనంతపురం అర్బన్ పరిధిలో సిపిఎంకి మంచి పట్టు ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమాలు, ప్రజా సమస్యల పట్ల సిపిఎం ముందుండి పోరాడుతోంది. దీంతో శివారు ప్రాంతాల్లోని ఓటర్లతో పాటు మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజల్లో సిపిఎం పట్ల సానుభూతి ఉంది. దీన్ని ఓట్లుగా మార్చుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. లోక్‌సత్తా పార్టీ మద్దతు సిపిఎం అభ్యర్థికి లభించే అవకాశం ఉంది. సిపిఎం పోటీలో ఉండడం తెలుగుదేశం పార్టీకి సమస్యగా మారిందని చెప్పాలి.

English summary
The YSR Congress party candidate is having edge at present over his rivals Congress candidate Nurshida Begum and Telugudesam candidate Mahalaxmi sribivas at Ananthapur urban seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X