ధర్నాలతో విజయమ్మ బిజీ: జగన్ రావాలని... కొండా

Posted By:
Subscribe to Oneindia Telugu
YS Vijayamma - Konda Surekha
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ వరుస ఆందోళనలు, దీక్షలతో బిజీ బిజీగా గడపనున్నారు. సోమవారం పులివెందులలో ధర్నాలో పాల్గొననున్న విజయమ్మ మంగళవారం విజయవాడ ధర్నాలో పాల్గొంటారు. ఆ తర్వాత ఈ నెల 23న కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో చేనేత కార్మికల కోసం ఒక్కరోజు దీక్ష చేపట్టనున్నారు.

నష్టపోయిన పండ్ల రైతులను ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ పులివెందులలోని సిఎస్‌ఐ మైదానంలో విజయమ్మ సోమవారం ధర్నా చేయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ధర్నా నిర్వహిస్తారు. ఈ ఏడాది పులివెందుల బ్రాంచ్ కాలువకు నీటిని వదలక పోవడం వల్ల చీనీ, అరటి సాగు చేసే రైతులు తీవ్రంగా నష్టపోయారు.

విద్యుత్ సంక్షోభం నివారణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ఈనెల 17వ తేదీన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే ధర్నాలో పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పాల్గొంటారని ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. బందర్ రోడ్డులో ఉన్న విద్యుత్‌శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు వివరించారు.

కృష్ణా జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ సామినేని ఉదయ భాను, నగర పార్టీ నాయకులు జలీల్‌ ఖాన్‌తో సహా పలువురు నేతలు ధర్నాలో పాల్గొంటారని చెప్పారు. అదే రోజు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ తరపున ధర్నాలు జరుగుతాయని రఘురామ్ వెల్లడించారు.

మరోవైపు తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి నిర్దోషిగా జైలు నుంచి విడుదల కోవాలని అమ్మవారిని కోరుకున్నానని ఆ పార్టీ నాయకురాలు కొండా సురేఖ వేరుగా ఆదివారం తెలిపారు. పాతబస్తీ బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం ఆమె లాల్‌దర్వాజా సింహవాహిణి మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, పాతబస్తీ బోనాల ఉత్సవాలను తాను తొలిసారిగా తిలకించానని, ఈ పండుగ వాతావరణం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు.

జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి నిర్దోషిగా విడుదలైతే వచ్చే ఏడాది ఒడి బియ్యం సమర్పిస్తానని అమ్మవారిని మొక్కుకున్నానని సురేఖ వివరించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆమెను శాలువాతో సన్మానించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం కొండా సురేఖ ఉప్పుగూడ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress party honorary president and Pulivendula MLA YS Vijayamma busy with agitations for these two days.
Please Wait while comments are loading...