• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఈడి దెబ్బకు ఠా: కాంగ్రెస్‌పై జగన్ యు-టర్న్ వెనుక?

By Srinivas
|

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈడి దెబ్బతోనే యు-టర్న్ తీసుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్ అక్రమాస్తుల కేసులో ఈడి ఇటీవల కోర్టు అనుమతితో విదేశీ పెట్టుబడులపై దర్యాఫ్తు చేస్తున్న విషయం తెలిసిందే. సిబిఐ కోర్టుకు సమర్పించిన ఛార్జీషీట్లను తీసుకున్న ఈడి వాటిని పరిశీలించిన అనంతరం ఈ ఆస్తుల కేసు నిందుతులను జైలులోనే ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి కోరింది.

కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈడి జైలులో బ్రహ్మానంద రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్‌లను గతంలో విచారించింది. అనంతరం జగన్‌ను విచారించేందుకు అనుమతి తీసుకొని రెండు రోజుల పాటు విచారించింది. వీరి నుండి జగన్ కంపెనీలలోకి వచ్చిన విదేశీ పెట్టుబడులపై ఆరా తీశారని సమాచారం. ఈడి అధికారులు జగన్ ఆస్తుల కేసుతో పాటు ఎమ్మార్ కేసు నిందితులను కూడా ప్రశ్నించారు.

జగన్ సిబిఐ విచారణలో ఏమాత్రం సహకరించలేదనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. స్వయంగా సిబిఐ కూడా జగన్, విజయ సాయి రెడ్డిలు నోరు మెదపడం లేదని కాబట్టి నార్కో టెస్టులకు అనుమతించాలని కోర్టును కోరింది. కోర్టు సిబిఐ పిటిషన్‌ను తిరస్కరించడం వేరే విషయం. అయితే ఈడి మాత్రం తన సూటి ప్రశ్నలతో జగన్‌కు ఝలక్ ఇచ్చిందంట. విదేశాల నుండి వచ్చిన పెట్టుబడులపై ఇప్పటికే వివరాలు సేకరించిన ఈడి... మరిన్ని వివరాలను జగన్ నుండి సేకరించేందుకు సిద్ధమవుతోందట.

విదేశాల నుండి వచ్చిన పెట్టుబడులపై ఈడి మరిన్ని వివరాల కోసం సిద్ధమవుతున్న నేపథ్యంలో తగ్గితేనే బావుంటుందని జగన్ యు-టర్న్ తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కూడా అలాంటి విమర్శలే చేస్తున్నాయి. వైయస్ విజయమ్మ ఢిల్లీ వెళ్లి ఓటుకు బెయిల్ ఒప్పందం చేయించుకొని వచ్చారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతి ఎన్నికలలో ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేయడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు చెప్పిన కారణాలు కూడా సరిగా లేవని అంటున్నారు.

రాష్ట్రపతి ఎన్నికలకు రాజకీయాలకు సంబంధం లేనప్పటికీ... ప్రస్తుత పరిస్థితులలో ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రాముఖ్యతను తీసి పారేయలేం. సంబంధం లేకుండా ఆత్మప్రభోదానుసారమే నిజమయితే ఈ విందులు, ఆర్భాటాలు, పార్టీ ఆదేశాలు ఇవన్నీ ఉండవు. ఏ పార్టీ కూడా అధికారికంగా ఒకరికి ఓటేయాలనే నిర్ణయం తీసుకోకూడదు. ఆయా అభ్యర్థికి నచ్చిన వారికి ఓటేయమని చెప్పవచ్చు. కాని అలా జరగడం లేదు.

ప్రణబ్ ఖచ్చితంగా యుపిఏ అభ్యర్థి అని, ఎలాంటి లాలూచీ లేకుంటే జగన్ పార్టీ అతనికి ఖచ్చితంగా ఓటు వేసి ఉండేది కాదని అంటున్నారు. అంతేకాకుండా జగన్ పార్టీ నేతల వ్యాఖ్యలు కూడా అనుమానాస్పదంగా ఉన్నాయని అంటున్నారు. ప్రణబ్ సీనియర్ నేత అయినప్పటికీ ఆయన రాష్ట్రపతి అయ్యాక కాంగ్రెసుకు అనుకూలంగా వ్యవహరించరనే వ్యాఖ్యల్లో అర్థం లేదంటున్నారు.

అయితే గియితే కాంగ్రెసును విభేదించిన, రాష్ట్రపతి రేసులో నిలబడటం కోసం సొంత పార్టీ నుండి బయటకు వచ్చిన, బిజెపితో అంతగా సాంగత్యం లేని పిఏ సంగ్మా నిష్పాక్షికంగా వ్యవహరించే వారేమో కానీ ప్రణబ్ మాత్రం అలా వ్యవహరించలేరని అంటున్నారు. ఇప్పటికే ఆస్తుల కేసు ఎంతో దూరం పోయిందని, మరింత ముందుకెళితే మరిన్ని కష్టాలు తప్పవని, అప్పుడు 2014 ఎన్నికలకు కష్టమవుతుందని భావించే జగన్ యుపిఐ అభ్యర్థికి జై కొట్టారని, తద్వారా సోనియాను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు.

English summary

 It is said that ED probe is behind YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan Reddy's U-turn. TDP and TRS are alleged that Jagan allied with Congress for bail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X