సొంత మీడియా.. ఇలా చేద్దాం: సిఎంకు ధర్మాన సూచన

రాష్ట్రంలో కాంగ్రెసు మళ్లీ పుంజుకునేలా చేసేందుకు ప్రభుత్వానికి 34, పార్టీకి 17 సూచనలు ధర్మాన కమిటీ చేసినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెసును 2014లో మళ్లీ అధికారంలోకి తీసుకు రావాలన్నా, పార్టీని రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో నిలపాలన్నా ఒక కొత్త పార్టీని స్థాపిస్తే ఎలా కష్టపడతామో, ఏఏ చర్యలు చేపడతామో, ఏ విధంగా వ్యూహాత్మకంగా వెళతామో అదే రకంగా వెళ్లాలని ధర్మాన కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లుగా సమాచారం.
ప్రభుత్వం పేదవారికి తాలిబోట్లు, గర్భిణీ స్త్రీలను ఆరోగ్య శ్రీలోకి చేర్చడం ఇలా పలు పథకాలను కొత్తగా తీసుకు వస్తే ప్రజలలో ప్రభుత్వంపై విశ్వసం పెరుగుతుందని వారు తెలిపారు. అలాగే పార్టీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ద్వారా కార్యకర్తల్లో పునరుత్తేజం వస్తుందని వీటిని వెంటనే భర్తీ చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ద్వారా పార్టీ ఇమేజ్ పెరుగుతుందని సూచించారు. కిందిస్థాయి క్యాడర్‌కు గుర్తింపు నివ్వడం, బిసిలకు మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
వృత్తి కళాకారులకు ప్రోత్సాహమివ్వాలని, బిసి, ఎస్సీ, ఎస్టీలకు భారీగా నిధులు కేటాయించాలని సూచించారు. గ్రామాలలో ఇందిరమ్మ విగ్రహాలను ఏర్పాటు చేయాలని, సంక్షేమ పథకాలను జోరుగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని, నెలకు వంద నియోజకవర్గాలలో సిఎం, మంత్రులు పర్యటించి ప్రజలతో మమేకం అవ్వాలని, గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని, సిఎం అధికారులకు అందుబాటులో ఉండాలని, కాంగ్రెసు అనుబంధ విభాగాలను పటిష్టం చేయాలని, పార్టీకి నష్టం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించింది.
అలాగే పార్టీకి సొంత మీడియా ఉండాలని కూడా తమ నివేదికలో పేర్కొన్నట్లుగా సమాచారం. సొంతగా పేపర్, టివి ఉంటే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడంతో పాటు, పార్టీ కార్యక్రమాలను కార్యకర్తల్లోకి తీసుకు వెళ్లేందుకు సులభమవుతుందని సూచించారని సమాచారం. సొంత మీడియా లేకున్నప్పటికీ అందుబాటులో ఉన్న మీడియాను ఉపయోగించాలని సూచించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications