ధర్మాన ఇష్యూ: కిరణ్, బొత్స సత్తిబాబు మధ్య చిచ్చు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ధర్మాన ప్రసాద రావు రాజీనామా లేఖను సమర్పించారు. ఈ విషయంలో తనను ముఖ్యమంత్రి సంప్రదించకపోవడంపై బొత్స సత్యనారాయణ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ధర్మాన విషయంపై తాను ఢిల్లీ పెద్దలతో మాట్లాడినట్లు ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయితే, ఈ విషయంపై పార్టీలో ఇంకా చర్చించలేదని ఆయన అన్నారు. ధర్మాన విషయంపై ముఖ్యమంత్రి తనతో చర్చించలేదని ఆయన చెప్పారు. ఈ మాటలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరు పట్ల బొత్స అసంతృప్తిని తెలియజేస్తున్నట్లు చెబుతున్నారు.
మంత్రులు బలవుతున్నారంటూ బొత్స మరో వ్యాఖ్య కూడా చేశారు. మంత్రులను కాపాడే విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విఫలమవుతున్నారనే ఆవేదన బొత్స మాటల్లో వ్యక్తమైనట్లు ఆ మాటలను అన్వయించుకుంటున్నారు. ధర్మాన రాజీనామాపై తుది నిర్ణయం ముఖ్యమంత్రిదేనని ఆయన చెప్పారు.
పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తనతో ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం పట్ల బొత్స సత్యనారాయణ మండిపడుతున్నట్లు కూడా చెబుతున్నారు. తనను ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదనే ఆవేదన కూడా ఆయనలో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ధర్మాన వ్యవహారంతో పార్టీకి ఏ విధమైన సంబంధం లేదనే పద్ధతిలో ముఖ్యమంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బొత్స సత్యనారాయణ భావిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications