తెలంగాణ: బాబు వేచి చూస్తారా, వెల్లడిస్తారా?

ఈ నేపథ్యంలో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనే సమాచారం ఏమైనా చంద్రబాబుకు చేరిందా అనేది కూడా అనుమానంగానే ఉంది. తెలంగాణపై తాను తేల్చేయడానికి సిద్ధంగా ఉన్నానని, తేల్చేస్తానని చంద్రబాబు అంటూ కూడా జాప్యం చేస్తున్నారు. కేంద్రం నిర్ణయం తీసుకుంటే, కాంగ్రెసు పార్టీ కూడా నిర్ణయం తీసుకున్నట్లే కాబట్టి తమ ప్రమేయం ఏమీ లేదని అనిపించుకోవడానికి ఆ జాప్యం చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పార్టీలో తెలంగాణపై అభిప్రాయభేదాలు ఉన్న మాట వాస్తవమేనని తెలుగుదేశం పార్టీ నాయకుడు దాడి వీరభద్ర రావు శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణపై వారం రోజుల్లు నిర్ణయం తీసుకుంటామని ఆ సీమాంధ్ర నాయకుడు చెప్పారు. రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కోసమంటూ ఆ ప్రాంత తెలుగుదేశం నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆందోళనకు దిగారు. పాదయాత్ర చేపట్టడానికి కూడా ఆయన సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వ ప్రకటన వెలువడే దాకా వేచి చూడడం ద్వారా ఆత్మరక్షణ చేసుకోవచ్చునని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం కూడదని, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోదలుచుకుంటే కేంద్ర ప్రభుత్వ ప్రకటన వచ్చే దాకా ఆగాలని, లేదంటే వైఖరి చెప్పాలని కాంగ్రెసుపై ఒత్తిడి తేవాలని తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నాయకులు చంద్రబాబుకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ముందు తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం ద్వారా సీమాంధ్ర ప్రజల నుంచి వ్యతిరేకను కొని తెచ్చుకోవడం ఎందుకని వారు వాదిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత స్థితిలో తెలంగాణపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారా, లేదా అనేది సందేహంగానే ఉంది.












Click it and Unblock the Notifications