సిఎంకు చేయి: జానా, బొత్స, దామోదర చర్చలు

తెలంగాణ జెఎసి ఈ నెల 30వ తేదీన తలపెట్టిన తెలంగాణ మార్చ్‌పై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి తెలంగాణ మంత్రులతో సమావేశమయ్యారు. జలుబు ఉందని చెప్పి జానా రెడ్డి ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఆయనతో పాటు తెలంగాణకు చెందిన ఐదు లేదా ఆరుగురు మంత్రులు సమావేశానికి గైర్హాజరయ్యారు.
పొన్నాల లక్ష్మయ్య, సారయ్య, గీతారెడ్డి, డికె అరుణ, శ్రీధర్ బాబు, దానం నాగేందర్ ఈ సమావేశానికి హాజరయ్యారు. మొత్తం 9 మంది తెలంగాణ మంత్రులు ఈ సమావేశానికి వచ్చారు. తెలంగాణ మార్చ్‌కు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి వారికి చెప్పినట్లు సమాచారం. మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని కోరుతూ తాను వీలైతే రేపు శాసనసభలో ప్రకటన చేస్తానని ఆయన మంత్రులతో చెప్పినట్లు తెలుస్తోంది. మార్చ్‌ను వాయిదా వేసుకునే విధంగా తెలంగాణ జెఎసి నేతలను ఒప్పించాలని ఆయన తెలంగాణ మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ మార్చ్‌ను అక్టోబర్ 20వ తేదీకి వాయిదా వేసుకుంటే మంచిదని కిరణ్ కుమార్ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలను తాను కోరుతానని ఆయన చెప్పారు. ట్యాంక్‌బండ్‌పై వినాయన నిమజ్జనం జరుగుతుండగా తెలంగాణ మార్చ్‌కు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. సమావేశానికి దామోదర రాజనర్సింహ, బొత్స సత్యనారాయణ కూడా హాజరు కాలేదని సమాచారం.
కాగా, బొత్స, జానా, దామోదర ఏం చర్చించారనేది తెలియడం లేదు. జానారెడ్డిని ముఖ్యమంత్రి చాలా విషయాల్లో దూరం పెడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించి సూచనలు చేయడానికి వేసిన మంత్రి వర్గ ఉపసంఘంలో పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న జానారెడ్డిని ముఖ్యమంత్రి వేయలేదు. జానారెడ్డికి, కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య దూరం చాలా పెరిగినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా కార్యాచరణ రూపొందించేందుకు ముగ్గురు నేతలు సమావేశమైనట్లు ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications