కూలిన చారిత్రక శివాజీ గోపురం: ముందుకొచ్చిన దాత

గోపురం శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు వర్షాల కారణంగా కూలిపోయింది. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లే చారిత్రక చరిత్ర కలిగిన శివాజీ గాలి గోపురం కూలిందని ఆరోపించారు. గోపురం శిథిలావస్థకు చేరుకుందని 2010లోనే నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. కానీ ప్రభుత్వం, అధికారులు దానిని పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. గతంలోనే ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుడు ఆల్తూరి నారాయణ రెడ్డి గోపురాన్ని పునర్నిర్మించేందుకు ముందుకు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదంటున్నారు.
ప్రస్తుతం గోపురం కూలిన నేపథ్యంలో నారాయణ రెడ్డి గోపురాన్ని నిర్మించేందుకు మరోసారి ముందుకు వచ్చారు. రూ.నాలుగు కోట్లతో గోపురాన్ని నిర్మిస్తానని తెలిపారు. శివాజీ గోపురం 12-14వ శతాబ్దానికి చెందిన కట్టడం. దీనికి 1965లో ఆధునీకరణ పనులు చేశారు. నిపుణుల సూచనల మేరకు 2011లో మేలో పునర్నిర్మాణం కోసం కలశ పూజలు చేశారు. సంవత్సరం దాటినా గోపురం తొలగింపు పనులు చేపట్టలేదు. దీంతో ఇప్పుడు వర్షాలకు తడిసి పైభాగం కూలిపోయింది. గోపురం కూలడం అరిష్టమని పండితులు చెబుతున్నారు.
ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం.. స్వరూపానంద స్వామి
శ్రీశైలం గాలి గోపురం కూలినప్పుడే అధికారులు శివాజీ గోపురం పునర్నిర్మాణ పనులు చేపట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి అన్నారు. ప్రభుత్వం, దేవాదాయ శాఖ అధికారులదే బాధ్యత అన్నారు. స్థపతులు, శిల్ప శాస్త్ర నిపుణులను పట్టించుకోకుండా సివిల్ ఇంజనీర్లతో పనులు కానివ్వడం వల్లే కూలిందన్నారు. హిందూ దేవాలయాలు, చారిత్రక కట్టడాల పట్ల ప్రభుత్వం, దేవాదాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications