• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోదండ దూకుడుకు కెసిఆర్ కళ్లెం? మార్చ్‌పై అసంతృప్తి

By Srinivas
|

K Chandrasekhar Rao - Kodandaram
హైదరాబాద్: ఇటీవలి కాలంలో స్వతంత్రంగా ముందుకెళ్తున్న తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాంకు చెక్ పెట్టాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. తెలంగాణ మార్చ్ విజయవంతం కావడంతో ఉద్యమ ప్రస్థానంలో గ్రాఫ్ పెరిగిన కోదండరాం దూకుడుకు కళ్లెం వేయాలని ఆయన భావిస్తున్నారని, గడిచిన కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్న వారు అంటున్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమం తన చేజారుతుండటం, స్వయంగా పురుడుపోసిన జెఏసి స్వతంత్రంగా ఎదగడం, దానికి చైర్మన్‌గా నియమించిన కోదండరాం ఏకు మేకుగా మారారని కెసిఆర్ భావిస్తుండటమే ఆయన తాజా ఎత్తుగడలకు మూలమని చెబుతున్నారు.

మిలియన్ మార్చ్‌కు ముందు నుంచే టీఆర్ఎస్-జేఏసీ, కేసీఆర్-కోదండ మధ్య భేదాభిప్రాయాలు మొదలయ్యాయి. కానీ, టీఆర్ఎస్ ముఖ్యులు కొందరు జేఏసీపై సానుకూలంగా ఉండటం వల్లే ఇన్ని రోజులైనా వారి బంధం కొనసాగుతోంది. మహబూబ్‌నగర్ ఉప ఎన్నికలతో టీఆర్ఎస్-జేఏసీ సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. అప్పటివరకు జేఏసీ విషయంలో టీఆర్ఎస్ఎల్పీ నేత ఈటెల రాజేందర్ కొంత సానుకూలంగా ఉండేవారు. పాలమూరు ఉప ఎన్నిక ఇన్‌చార్జిగా ఉన్న ఈటెల, అక్కడ పార్టీ ఓటమికి జేఏసీయే కారణమని నమ్మడమే కాక, అదే విషయాన్ని పార్టీ అధినేతకు నివేదించారు.

దీంతో ఆ ఎన్నికల ఫలితం తర్వాత జేఏసీ-కోదండరాం అంటేనే మండిపడుతున్నారు. అసలు జేఏసీ చైర్మన్ పదవి నుంచి కోదండరాంను తప్పించి స్వామిగౌడ్‌ను కూర్చోబెట్టాలని కూడా ప్రయత్నించారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన జేఏసీలోని కోదండరాం మద్దతుదారులు రాజకీయ పార్టీలు లేకుండా స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి కోదండరాం నేతృత్వంలోనే పనిచేస్తామని తీర్మానించారు. తర్వాత జరిగిన పరకాల ఉప ఎన్నికలు కూడా కోదండ-కేసీఆర్ మధ్య దూరాన్ని పెంచాయి. కోదండరాం కొంత తగ్గినా.. కేసీఆర్ శాంతించలేదు. దీంతో కోదండరాం తన పని తాను చేసుకుపోతున్నారు.

ఈ క్రమంలోనే సెప్టెంబర్ 30న తెలంగాణ మార్చ్‌కు పిలుపునిచ్చి.. విజయవంతంగా నిర్వహించారు. మార్చ్‌కు ముందు హరీశ్‌రావు జేఏసీ విషయంలో కొంత సానుకూలంగా స్పందించారు. మార్చ్‌పై మొదట వ్యతిరేకంగా ఉన్న టీఆర్ఎస్ చివరి దశలో అనివార్యంగా మద్దతు ప్రకటించి, పాల్గొంది. అయితే మార్చ్‌ను నిరవధికం చేసే విషయంలో హరీశ్‌రావును కోదండరాం సంప్రదించకపోవటం, పైగా వేదిక నుంచి ఆయనను ఉద్దేశించి ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్‌గౌడ్ అసందర్భంగా మాట్లాడటం, కేసీఆర్‌పై విమలక్క విమర్శలతో హరీశ్‌రావు కూడా జేఏసీని సమర్థించలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా టీఆర్ఎస్ మొత్తం ఇప్పుడు జేఏసీ, ప్రత్యేకించి కోదండరాంపై మండిపడుతోంది.

ఎప్పటి నుంచో కోదండరాంపై కత్తులు నూరుతున్న కేసీఆర్, ఇదే అదనుగా ఆయనకు కళ్లెంవేసే ఎత్తుగడలు మొదలుపెట్టారు. పార్టీలు లేకుండా జేఏసీ ఎక్కువ కాలం మనజాలదని చెబుతూ.. వారిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత త్వరలో జరిగే స్టీరింగ్ కమిటీ భేటీలో పాల్గొని మరోసారి జేఏసీని, ఉద్యమాన్ని తన చేతుల్లోకి తీసుకోవటమే కేసీఆర్ ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇది జరిగితే కోదండరాం దూకుడుకు కళ్లెం పడినట్టేనని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జేఏసీ నుంచి కోదండరాంను తప్పించడం తేలిక కాదని, ఆయన ప్రాధాన్యం తగ్గించటమే గులాబీబాస్ లక్ష్యం కావచ్చని జేఏసీ వర్గాలు అంటున్నాయి.

English summary

 It is said that Telangana Rastra Samithi chief K Chandrasekhar Rao is thinking to put pullstop to Telangana JAC chairman Kodandaram speed. KCR is still angry at Kodandaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X