నాడు వైయస్ యాత్రలో నేడు షర్మిల వెంట వృద్ధుడు

ఈ యాత్రలో ఖమ్మం జిల్లా గోనకల్ మండలం చెన్నవీరమానుపల్లికి చెందిన గంగరాజు పాల్గొన్నారు. 2003లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన ప్రజా ప్రస్థానంలో ఆయన మూడు జిల్లాల్లో నడిచారు. ఇప్పుడు షర్మిల వెంట నాలుగు జిల్లాల్లో నడుస్తానని చెబుతున్నారు. తాను స్వతంత్ర సమరయోధుడిని అని, రాజకీయ నాయకులు అంటే తనకు ఏమాత్రం గిట్టదని చెప్పారు.
అయితే వైయస్ రాజశేఖర రెడ్డిని మాత్రం అభిమానించే వాడినని, అతనంటే వల్లమాలిన ప్రేమ అని చెప్పాడు. అందుకే ఆయన ముఖ్యమంత్రి కావాలని పూజలు చేశానని చెప్పారు. 2003లో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేసినప్పుడు తాను ఆయనతో పాటు ఖమ్మం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో నడిచానని చెప్పారు.
ఇప్పుడు తన వయస్సు 87 అని, అయినప్పటికీ తనకు ఏమాత్రం భయం లేదని, జగన్‌ను అక్రమంగా జైలులో పెట్టారని, వైయస్ కుటుంబాన్ని వేధిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో కూడా షర్మిల ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నారని అందుకే తాను కూడా పాల్గొనేందుకు వచ్చానని చెప్పారు. అప్పుడు తాను మూడు జిల్లాల్లో పర్యటించానని, ఇప్పుడు నాలుగు జిల్లాల్లో పర్యటిస్తానని చెప్పారు. తన ప్రాణం పోయినా భయపడనన్నారు.
కాగా శుక్రవారం ఉదయం 9.30 గంటలకు వేంపల్లె నుండి షర్మిల పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా షర్మిల టిడిపి, కాంగ్రెసులపై నిప్పులు చెరిగారు. వైయస్ అధికారంలో ఉన్నా లేకున్నా ఎల్లప్పుడూ రైతుల మేలు కోసమే ఆలోచించేవారని అన్నారు. విద్యుత్ సరిగా లేక రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.












Click it and Unblock the Notifications