పార్టీని వీడేవారిపై కన్నేసిన బాబు, మధ్యంతరం మాట

మధ్యంతర ఎన్నికలు ఏ క్షణంలోనైనా రావచ్చునని చంద్రబాబు పోలిట్‌బ్యూరో సమావేశంలో అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. దేశంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితి వల్ల వల్ల పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. పార్టీలో వలసలపై జిల్లాలు, నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరపాలని ఆయన చెప్పారు. ప్రస్తుతం వలసలను ఆపడం అవసరమని ఆయన చెప్పారు.
తన పాదయాత్రను ముందు నిర్ణయించినట్లు జనవరి 26వ తేదిన ముగించే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు. తమ పార్టీ నేత ఎర్రంనాయుడు ప్రమాదంలోనే మరణించినట్లు భావిస్తున్నామని, అయితే, మీడియాలో వస్తున్న వార్తాకథనాలను పరిశీలిస్తున్నామని సమావేశానంతరం పార్టీ నాయకులు దాడి వీరభద్ర రావు, కడియం శ్రీహరి మీడియా ప్రతినిధులతో చెప్పారు.
నీలం తుఫానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసిందని వారు చెప్పారు. తుఫాను బాధితులను వెంటనే ఆదుకోవాలని వారు కోరారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని వారు కోరారు. చంద్రబాబు పాదయాత్ర జనవరి 26వ తేదీ వరకు కొనసాగుతుందని వారు చెప్పారు. నీలం తుఫాను మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలేసి నష్టపరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. వలసల వల్ల పార్టీకి ఏ విధమైన నష్టం లేదని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications