వోటింగ్‌కు రెడీ: మెజారిటీ ఉందన్న ప్రధాని

తాము వోటింగుకు సిద్ధంగానే ఉన్నామని ఆయన చెప్పారు. ఏ నిబంధన కింద చర్చకు అనుమతించాలనేది లోకసభ స్పీకర్ ఇష్టమని ఆయన అన్నారు. యుపిఎ సమన్వయ కమిటీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమన్వయ కమిటీ సమావేశంలో యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీతో పాటు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్, హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ పాల్గొన్నారు.
ఎఫ్‌డిఐలపై యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని డిఎంకె మంగళవారం ప్రకటించింది. దీంతో కాంగ్రెసుకు ఊరట లభించినట్లయింది. మతతత్వవాదులు అధికారంలోకి రాకుండా ఉండడానికి యుపిఎకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు డిఎంకె తెలిపింది. ఎఫ్‌డిఐల వ్యవహారంపై యుపిఎకు, తమకు మధ్య వంద విభేదాలు ఉన్నా ఈ ప్రభుత్వం పడిపోతే తలెత్తే విపత్కర పరిణామాలను అడ్డుకోవడానికి నిర్ణయించుకున్నట్లు డిఎంకె అధినేత కరుణానిధి తెలిపారు.
ఎఫ్‌డిఐలపై వోటింగ్‌కు కూడిన చర్చ జరిగినా తమకు అభ్యంతరం లేదని సమన్వయ కమిటీ సమావేశానంతరం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. తగిన సంఖ్యాబలం తమకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. స్పీకర్ ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా యుపిఎ ఈ విషయంలో ఏకతాటి మీద నడుస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications