వైయస్ జగన్‌తో వచ్చే ఎమ్మెల్యేలు ఎంత మంది?

వలసలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు గోరంతలు కొండంతలు చేసి చెబుతున్నారనే మాట వినిపిస్తోంది. జగన్ వెంట 170 మంది శానససభ్యులు వస్తారని చెప్పిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాస రెడ్డి ఓ సందర్భంలో 20 మంది వస్తారని అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు బెయిల్ వచ్చిన తర్వాత తమ పార్టీ శాసనసభ్యులతో పాటు 20 మంది కాంగ్రెసు శాసనసభ్యులతో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు గవర్నర్‌కు లేఖ ఇస్తామని చెప్పారు.
కాంగ్రెసుకు చెందిన అంత మంది లేఖ ఇచ్చినప్పుడు గవర్నర్ వద్ద పరేడ్ జరుగుతుందని, అప్పుడు ప్రభుత్వం కూలిపోతుందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే కూలగొట్టే ప్రయత్నాలు కూడా చేయబోమనే విషయాన్ని కూడా ఆయన తేల్చేశారు. కానీ, అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వెనకాడుతున్నారని, ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యతను తీసుకోవడం వల్లనే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడదం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తెరిపి లేకుండా ప్రచారం సాగించారు.
బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రకటన వెలువడిన తర్వాత ఆ ప్రచారాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తగ్గించినట్లు ఉన్నారు. అయితే, జగన్ వెంట వచ్చే శానససభ్యుల విషయంలో మాత్రం బయటకు పెద్ద లెక్కలే కనిపిస్తున్నాయి. కానీ, ఇటీవల కాంగ్రెసు శాసనసభ్యుడు వీరశివారెడ్డి జగన్ వెంట తమ పార్టీకి చెందిన పది మంది శాసనసభ్యులు వెళ్లే అవకాశం ఉందని చెప్పారు.
ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ పరిశీలకులుగా వచ్చిన ఇద్దరు నేతల వద్ద వీరశివా రెడ్డి ఆ మాట చెప్పారు. వైయస్ జగన్‌ను తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెసు నాయకుల్లో వీరశివా రెడ్డి ఒక్కరు. అందువల్ల వీరశివా రెడ్డి చెప్పే మాటల్లో నిజం ఉండే అవకాశం ఉంది. అయితే, ఎన్నికలు సమీపించినప్పుడు జంప్ జిలానీలు ఎక్కువగానే ఉండవచ్చు. అయితే, అవి ఏకపక్షంగా ఉంటాయని కూడా చెప్పలేం.












Click it and Unblock the Notifications