శకుని మాటలు వినొద్దు: పురంధేశ్వరికి బుచ్చయ్య

పార్లమెంటు ఆవరణలో అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టాలని తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిందని, దాంతో 2006 జూన్ 28వ తేదీన సంబంధిత కమిటీ అప్పటి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత ఎర్రంనాయుడికి అనుమతి ఇచ్చిందని, దాంతో తాము వడయార్‌తో విగ్రహాలు తయారు చేయించి చూపించామని, కానీ నిలువెత్తు విగ్రహాహాలు కావాలని సంబంధిత కమిటీ పరిశీలించి చెప్పిందని ఆయన వివరించారు. ఈలోగా పురంధేశ్వరి పార్లమెంటుకు ఎన్నికయ్యారని, తమ పార్టీ వైఖరికి భిన్నంగా పురంధేశ్వరి లేఖ ఇచ్చారని ఆయన అన్నారు.
కాంగ్రెసుకు వ్యతిరేకంగా పోరాడిన ఎన్టీ రామారావును స్వార్థం కోసం పురంధేశ్వరి వాడుకోవాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్టీ రామారావుతో వైయస్ రాజశేఖర రెడ్డిని పోల్చినప్పుడే అలా పోల్చవద్దని తాము పురంధేశ్వరికి చెప్పామని ఆయన అన్నారు. ఎన్టీ రామారావు పురంధేశ్వరి తండ్రి మాత్రమే కాదని, కోట్లాది ప్రజల ఆరాధ్యదైవనమని, అలాంటి వ్యక్తి గౌరవానికి భంగం కలిగే విధంగా పురంధేశ్వరి వ్యవహరించడం మంచిది కాదని ఆయన అన్నారు. శకుని మాటలు నమ్మి వివాదాలకు దిగవద్దని ఆయన అన్నారు.
"దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు చెప్తున్నా, విగ్రహం నీ సొత్తా, ఎన్టీఆర్ నీ సొత్తా" అని ఆయన అన్నారు. "చంద్రబాబును నువ్వు పిలవడమేమిటి, ఎవరు ఎవరిని పిలవాలో మాకు తెలుసు" అని ఆయన అన్నారు. విగ్రహం పెట్టినా పెట్టకపోయినా ఎన్టీ రామారావు ప్రజల్లో గుండెల్లో ఉంటాడని ఆయన అన్నారు. ఇప్పటికైనా పురంధేశ్వరి వివాదాలు మానుకుని విగ్రహ ప్రతిష్టాపనకు సహకరించాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications