అల్లుళ్లకు, పార్టీకేం పని: బాలయ్యకు హరికృష్ణ కౌంటర్

"తెలుగుజాతి ఆత్మ గౌరవాన్ని నిలిపి, తెలుగువాడి ఔన్నత్యాన్ని చాటి చెప్పిన ఎన్టీఆర్ విగ్రహం పార్లమెంట్‌లో నెలకొల్పాలన్న నిర్ణయం ప్రతి తెలుగువాడు గర్వించాల్సిన విషయం. ఇందులో పార్టీకానీ, అల్లుళ్లు కానీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు'' అని ఎన్టీఆర్ కుమారుడు, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ ఘంటాపథంగా చెబుతున్నారంటూ ఆ పత్రిక తెలియజేసింది.
ఎన్టీఆర్ విగ్రహం నెలకొల్పడం పూర్తిగా కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు జరిగిందని, ఈ విషయంలో మరెవ్వరూ జోక్యం చేసుకోరాదని ఆయన తన సన్నిహితుల వద్ద స్పష్టం చేస్తున్నారని అంటున్నారు. ఎన్టీఆర్ పార్టీలకు అతీతమైన, తెలుగు వారికి ప్రియమైన నేత. గొప్ప కళాకారుడని, ఆనేక పౌరాణిక పాత్రల్లో నటించి కోట్లాదిమంది ఆరాధ్యదైవంగా కొలిచిన మహా నటుడని హరికృష్ణ అంటున్నట్లు ఆ పత్రిక రాసింది.
తెలుగు జాతిని తట్టిలేపిన నాయకుడని, అనేక విప్లవాత్మక నిర్ణయాల ద్వారా సామాన్య ప్రజల గుండెల్లో చిరస్థాయి నిలిచిపోయిన మహా మనిషి అని, ఎన్టీఆర్‌ను ఒక పార్టీకి పరిమితం చేయడం సరైంది కాదని హరికృష్ణ ఆవేశంతో అంటున్నారని ఆ పత్రిక రాసింది. పార్లమెంట్‌లో ఇక భవిష్యత్తులో విగ్రహాలు నెలకొల్పబోరని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని ఆయన గుర్తు చేస్తూ - ఇలాంటి సమయంలో అల్లుళ్లు, పార్టీ నేతలు వివాదాస్పద ప్రకటనలు చేసి ఎన్టీఆర్ విగ్రహం నెలకొల్పలేని పరిస్థితి కల్పించరాదని, ఎవరికి వారు ఇది తమ ఘనతగా చెప్పుకొనేందుకు ప్రయత్నించవద్దని హరికృష్ణ భావిస్తున్నారని అంటున్నారు.
ఎఫ్‌డిఐలపై ఓటింగు సందర్భంగా ముగ్గురు సభ్యులు రాజ్యసభకు గైర్హాజరు కావడంపై కూడా ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. పార్టీ పరువును గంగలో కలుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications