తెలంగాణపై రివర్స్ గేర్: ఆ ఇద్దరికి చిక్కులు

Chandrababu Naidu-YS Jagan
హైదరాబాద్: తెలంగాణ అంశం తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసులో చిచ్చు రేపుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇన్నాళ్లూ ఆ పార్టీలలోని ఇరు ప్రాంతాల నేతలు సంయమనం పాటించినట్లుగా కనిపించింది. కానీ క్రమంగా వారు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా, అనుకూలంగా గళమెత్తుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందున టిటిడిపి నేతలు, తెలంగాణపై భారం కేంద్రంపై వేసినందున తెలంగాణ వైయస్సార్ కాంగ్రెసు నేతలు అదే వాదనతో ప్రజల్లోకి వెళుతున్నాయి.

ఆ రెండు పార్టీల సీమాంధ్ర నేతలు ఇన్నాళ్లు మౌనంగా ఉన్నారు. వారి మౌనాన్ని అధికార కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర నేతలు ఇన్నాళ్లు ప్రశ్నించారు. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు తెలంగాణకు వ్యతిరేకమా? లేక అనుకూలమా? చెప్పాలని, బాబు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఇన్నాళ్లూ సమైక్యాంధ్ర అన్న సీమాంధ్ర టిడిపి నేతలు గాజులు తొడుక్కున్నారా? అని ఇలా సీమాంధ్ర కాంగ్ నేతలు ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించారు.

సీమాంధ్ర కాంగ్రెసు నేతలు ప్రభావమో లేక ఇన్నాళ్లు నివురు గప్పిని నిప్పుగా ఉన్నారో ఏమో కానీ ఒక్కసారిగా టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర నేతలు తెలంగాణకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. జగన్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి ఒకింత ఆవేశంగానే తెలంగాణపై పార్టీ అభిప్రాయంతో విభేదించారు. తాను సమైక్యవాదిని అని, పార్టీ నిర్ణయం తన వ్యక్తిగత అభిప్రాయం వేరని అన్నారు.

మరో అడుగు ముందుకేసి మంత్రి గంటా శ్రీనివాస రావు తనను సమైక్యాంధ్ర సమావేశానికి ఆహ్వానిస్తే వెళతానని చెప్పారు. కొందరు స్వార్థపూరిత నేతలు తెలంగాణ వచ్చిందని, తీసేసుకున్నామన్నట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం నిర్ణయానికి కట్టుబడతామని తాము చెప్పలేదని, మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని తాము కోరామన్నారు. అయితే గుర్నాథ్ రెడ్డి వ్యాఖ్యలు వివాదస్పదం కావడంతో పార్టీ అధిష్టానం ఆయనకు అక్షింతలు వేసింది.

తెలుగుదేశంలోనూ...

అఖిల పక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం ఇప్పటికే అటు సీమాంధ్రలో బాబును ఇరుకున పెట్టింది. ఇప్పుడు పార్టీ నేతలు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎవరు కూడా పార్టీ నిర్ణయాన్ని, బాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పకపోయినప్పటికీ తాము గట్టి సమైక్యవాదులమని మాత్రం ఖరాఖండిగా చెప్పేస్తున్నారు.

అఖిల పక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిన వెంటనే అప్పుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే తాను తెలంగాణకు వ్యతిరేకం తప్ప టిడిపికి, బాబుకు వ్యతిరేకం కాదన్నారు. నన్నపనేని రాజకుమారి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాజాగా కోడెల శివ ప్రసాద్ ఈ రోజు మాట్లాడుతూ... బాబును సీమాంధ్రలో అడ్డుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

అదే సమయంలో... తాము తెలంగాణ ఇస్తే చెయ్యిత్తి జై కొడతామని ఎక్కడా చెప్పలేదంటున్నారు. పయ్యావుల కేశవ్ కూడా తెలంగాణపై పార్టీ నిర్ణయాన్ని ప్రశ్నించకున్నప్పటికీ తెలంగాణ నేత నాగం జనార్ధన్ రెడ్డిపై సమైక్యాంధ్రకు అనుకూలంగా సెటైర్లు వేశారు. తద్వారా తాము సమైక్యవాదులమని చెప్పారనవచ్చు. సీమాంధ్ర టిడిపి నేతల వ్యాఖ్యలు టిటిడిపి నేతల్లో వణుకు పుట్టిస్తున్నాయి.

గతంలో ఒక్క మోదుగుల మాట్లాడినప్పుడే తెలంగాణవాదులు, టిఆర్ఎస్ నేతలు ఆయనపై చంద్రబాబు చర్యలు తీసుకోవాలని లేదంటే, టిడిపిని తెలంగాణ వ్యతిరేక పార్టీగా గుర్తిస్తామని హెచ్చరించారు. అది అక్కడితో ముగిసిపోయింది. అయితే తాజాగా సీమాంధ్ర టిడిపి నేతలు తెలంగాణను వ్యతిరేకించక పోయినప్పటికీ ఆ మాటల్లో తెలంగాణ వ్యతిరేక వాదం వినిపిస్తోంది. ఇది బాబును మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+