ఉండవల్లి భేష్!: హరీష్ రావు ప్రశంస, ఎబివిపి ఆందోళన

Harish Rao
హైదరాబాద్: రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్‌ను తాను ఒక్క విషయంలో మెచ్చుకుంటున్నానని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు బుధవారం అన్నారు. ఉండవల్లి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు మంగళవారం తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై మండిపడటాన్ని ఆయన తప్పుపట్టారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారత దేశానికి స్వాతంత్రం బ్రిటిష్ వారు ఆమోదిస్తేనే వచ్చిందని చెప్పడం ద్వారా ఉండవల్లి జాతిపిత మహాత్మా గాంధీని, స్వతంత్ర సమరయోధులను అవమానపర్చారని ఆరోపించారు. సమాన హక్కుల కోసం మహాత్ముడి మార్గంలో తెలంగాణ ఉద్యమం కొనసాగిస్తున్నామన్నారు. దేశ ప్రజలు పోరాడితే రెండు వందల ఏళ్ల తర్వాత స్వాతంత్రం బ్రిటిష్ వాళ్లు ఇచ్చారని కెసిఆర్ అనడంలో తప్పేముందన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ హింస గానీ, దాడులు గానీ జరగడం లేదన్నారు. కెసిఆర్‌ను విమర్శించాలన్న లక్ష్యంతో గాంధీజీని సైతం ఉండవల్లి అవమానించారన్నారు. కెసిఆర్ వ్యాఖ్యలను వక్రీకరించడమే, ఆయనపై బురద జల్లడమే పనిగా వారు పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. తాము గాంధీ మార్గంలో ఉద్యమం చేస్తున్నామన్నారు. తెలంగాణపై టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిలదీయకుంటే మెచ్చుకోవాలా అని ప్రశ్నించారు.

ఆ పార్టీకి చెందిన పలువురు సీమాంధ్ర నేతలు తాము సమైక్యవాదులం అంటే అడగవద్దా అన్నారు. ఉండవల్లి.. బాబుతో తమ ఒప్పందాన్ని బయట పెట్టుకున్నారన్నారు. తెలంగాణ విషయంలో చంద్రబాబు, కాంగ్రెసు ఒకటే అన్నారు. ఉండవల్లి భావదారిద్ర్యంతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బాబు మీద ఉండవల్లికి ప్రేమ ఎందుకో చెప్పాలన్నారు. భారత ప్రజల పోరాటంతో స్వాతంత్రం వచ్చిందని కెసిఆర్ అన్నారన్నారు.

కెసిఆర్ వ్యాఖ్యల్లో ఏవీ అబద్దమో ఉండవల్లి చెప్పాలన్నారు. కెసిఆర్ మాటల్లో అబద్దాలు ఉన్నాయంటే తాము బహిరంగ చర్చకు సిద్ధమని హరీష్ రావు సవాల్ విసిరారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేస్తున్న కేంద్రం స్పందించక పోవడం దారుణం అన్నారు. రాజమండ్రి సభలో జై ఆంధ్రప్రదేశ్ అన్న ఉండవల్లి మంగళవారం న్యూఢిల్లీలో తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పడంపై తాను ఉండవల్లిని మెచ్చుకుంటున్నానని చెప్పారు. ఈ ఒక్క విషయంలో ఆయన భేష్ అని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయని వారిపై ముందుగా కేసులు పెట్టాలని ఆయన అన్నారు. మధు యాష్కీ, వి హనుమంత రావులకు అధిష్టానంతో ఉన్న పరపతి అందరికీ తెలుసు అన్నారు. కేసులకు భయపడే ప్రసక్తి లేదని, అది తమకు కొత్త కాదన్నారు. హైదరాబాదుతో కూడిన తెలంగాణ ఇస్తామని ఆజాద్ ప్రకటిస్తే తెరాస విలీనం లేఖ తాము వారి చేతిలో పెడతామన్నారు. రాహుల్, సోనియాలతో తెలంగాణ ప్రకటన చేయించాలన్నారు. తెలంగాణపై వారిద్దరూ చర్చించాలని ఆయన అన్నారు.

ఎబివిపి ఆందోళన

తెలంగాణ కోసం ఈ ప్రాంత మంత్రులు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్(ఎబివిపి) బుధవారం బంజారాహిల్సులోని మంత్రుల క్వార్టర్సును ముట్టడించింది. పార్లమెంటులో బిల్లు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. వారిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. పోలీసు స్టేషన్‌కు తరలిస్తుండగా విద్యార్థులు వ్యాన్‌లో నుండి కిందకు దూకి పోలీసు వాహనానికి అడ్డుపడ్డారు. ఆ తర్వాత పోలీసులు మరోసారి వారిని అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+