తీహార్ జైలులో అఫ్జల్ గురుకు ఉరి, కాశ్మీర్‌లో కర్ఫ్యూ

పార్లమెంటుపై దాడి కేసులో దోషి అఫ్జల్ గురు మెర్సీ పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. 2001లో పార్లమెంటుపై దాడి కేసులో అతనికి ఉరిశిక్ష పడింది. మెర్సీ పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడంతో అఫ్జల్ గురుకు త్వరలో ఉరిశిక్షను అమలు చేసినట్లు తెలుస్తోంది.
అఫ్జల్ గురుకు 2004లో సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. అతనికి 2006లోనే ఉరి శిక్షను అమలు చేయాలని అనుకున్నారు. అయితే, అతని భార్య మెర్సీ పిటిషన్ దాఖలు చేయడంతో అది ఇంతకాలం ఆగింది. తాను మెర్సి పిటిషన్‌ను తిరస్కరించిన విషయాన్ని రాష్ట్రపతి హోం మంత్రిత్వ శాఖకు తెలియజేశారు. 2001 డిసెంబర్‌లో ఐదుగురు సాయుధులు పార్లమెంటు ఆవరణలోకి ప్రవేశించి, కాల్పులు జరిపారు.
పార్లమెంటుపై దాడిలో ఏడుగురు మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది భద్రతా బలగాలకు చెందినవారే. ఉగ్రవాదులను కాల్చి చంపారు. పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడిన కొద్దిసేపటికే ఉగ్రవాదులు దాడికి ఒడిగట్టారు. ఆ సమయంలో పార్లమెంటు సభ్యులు లోపలే ఉన్నారు. ఆ తర్వాత కొద్దిరోజులకు అఫ్జల్ గురును అరెస్టు చేశారు.
ముంబై ఉగ్రవాదుల దాడి కేసులో అజ్మల్ కసబ్‌కు ఇటీవలే ఉరిశిక్ష అమలైంది. అఫ్జల్ గురుకు ఉరిశిక్షను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై ప్రతిపక్ష బిజెపి అప్పటి నుంచి ప్రశ్నిస్తూ వస్తోంది. గత నెల 23వ తేదీననే అఫ్జల్ గురు క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించినట్లు తెలుస్తోంది. అఫ్జల్ గురు జమ్మూ కాశ్మిర్‌లోని బారాముల్లాకు చెందినవాడు.












Click it and Unblock the Notifications