దోషులను పట్టుకుని, కఠినంగా శిక్షిస్తాం: కిరణ్ రెడ్డి
హైదరాబాద్: హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేలుళ్ల దుర్ఘటనకు బాధ్యులైనవారిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం రాత్రి వెల్లడించారు. ఈ దుర్ఘటనకు బాధ్యులైనవారిని పోలీసులు తప్పకుండా పట్టుకుంటారన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 11 మందిలో మరణించారని, 80 మంది గాయపడ్డారని, వారిలో ఐదారుగురి పరిస్థితి ఆందోళనకరంగ ఉందని ఆయన వెల్లడించారు.
దిల్‌షుక్‌నగర్‌లో బాంబు పేలుళ్లు సంభవించిన ప్రాంతంలో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి పర్యటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 150 గజాల దూరంలో రెండు సంఘటనలు జరిగాయని చెప్పారు. పేలుళ్లు సంభవించిన ప్రాంతాలకు వెళ్లి చూడాలని యత్నించరాదని ఆయన ప్రజలకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. దానివల్ల ఆధారాలు చెరిగిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎంతటి పెద్ద వాళ్లయినా ఈ దుర్ఘటనకు బాధ్యులని తేలితే వారిని వదిలిపెట్టేది లేదని ఆయన చెప్పారు. ఈ దుర్ఘటనలో గాయపడినవారికి ప్రభుత్వమే పూర్తి చికిత్స జరిపిస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ చేశామని ఆయన చెప్పారు. మృతుల కుటుంబాలకు ఆరు లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడినవారికి ఆ పరిస్థితిని బట్టి ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ఆయన చెప్పారు.
కేవలం పిరికిపందలే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడతారని అన్నారు ఈ పరిస్థితులలో ప్రజలు భయపడకుండా జాగ్రత్తగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు కేంద్రం కూడా ప్రత్యేక బలగాలను పంపిస్తున్నదని ఆయన చెప్పారు, ఇది నిఘా వ్యవస్థ వైఫల్యమా అని మీడియా అడిగిన ప్రశ్నకు అటువంటి విషయాలన్నీ దర్యాప్తు పూర్తి అయిన తర్వాత తెలుస్తాయని ఆయన సమాధానమిచ్చారు.
దాడులు జరగవచ్చునని కేంద్ర హోం శాఖ నుంచి రెండు రోజుల క్రితమే హెచ్చరికలు వచ్చాయట కదా అని అడిగిన ప్రశ్నకు పరిస్థితులు అనుమానాస్పదంగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా జాగ్రత్తగా ఉండాలని అన్ని రాష్ట్రాలకూ అటువంటి సమాచారం వస్తుందని, అలాగే మనకి కూడా వచ్చిందని ఆయన చెప్పారు, మన పోలీసు వ్యవస్థ చాలా పటిష్టమైనది కాబట్టి ఖచ్చితంగా దోషులను పట్టుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications