ఇంటర్వ్యూపై విజయమ్మ వివరణ: గెలుపు వెనుక జగన్

రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే తాము మద్దతు పలుకుతామని తాను మళ్లీ మళ్లీ చెబుతున్నానని ఆమె అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీ ముప్పై నుండి ముప్పై ఐదు లోకసభ స్థానాలను గెలుచుకుంటుందని చెప్పారు. జగన్ ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నారని, ఆయన ఇప్పుడు జైలులో ఉన్నా ప్రజల కోసమే ఆలోచిస్తున్నారని, అలాంటి వ్యక్తికి ప్రజలు మద్దతు పలుకుతుంటే తమకు మరో పార్టీతో కలిసి వెళ్లే అవసరమేముందని ఆమె ప్రశ్నించారు.
ఎల్లో మీడియా అవాస్తవాలు ప్రచారం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని తానంటే ఎల్లో మీడియా వక్రీకరిస్తోందన్నారు. 2014లో ఏ పార్టీ ఉంటుందో ఎవరికి తెలుసునని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తామన్నారు. గతంలో జగన్ కూడా అదే చెప్పారన్నారు. ఎకనామిక్ టైమ్స్ పత్రిక మొదటి పేజిలో ఒకటి రాసి.. రెండో పేజీలో తాను చెప్పింది రాసిందన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత ప్రజల గురించి ఆలోచించే పార్టీ లేకుండా పోయిందన్నారు. ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం కొనసాగించడం లేదని విమర్శించారు. వైయస్ మృతితో రాష్ట్రానికి పెద్ద దిక్కు కోల్పోయినట్లుగా ఉందన్నారు. రాజకీయ పరిణామాలు మారిపోయాయని చెప్పారు. వైయస్ ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించే వారని, ఆయన దారిలో జగన్ నడుస్తున్నారని చెప్పారు.
మన పార్టీ ఎందుకు పుట్టుకు వచ్చిందంటే....
వైయస్ పథకాలకు కాంగ్రెసు ప్రభుత్వం తూట్లు పొడవటం, ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీ అండగా ఉండటం, ప్రజల గురించి ఆలోచించే పార్టీలు, రాజకీయ నాయకులు లేకపోవడం వల్లనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పుట్టుకు వచ్చిందని వైయస్ విజయమ్మ చెప్పారు. ఈ పార్టీ ఇప్పుడు ఇంటింటి పార్టీ అయిపోయిందన్నారు. రెండున్నరేళ్లు జగన్ ఓదార్పు యాత్రతో ప్రజల్లో ఉన్నారని, ఇప్పుడు షర్మిల ఆయన బాధ్యతలు తీసుకుందన్నారు.
జగన్ అవినీతికి పాల్పడకపోయినా ఆరోపణలతో అరెస్టు చేశారన్నారు. బెయిల్ అడిగితే ఎంపి, పార్టీ అధ్యక్షుడు కాబట్టి సాక్ష్యులను ప్రబావితం చేస్తారని చెబుతూ బెయిల్‌ను నిరాకరిస్తున్నారని ఆరోపించారు. ఆయన ప్రజల్లో ఉన్నప్పుడు సాక్ష్యులను ప్రభావితం చేయలేదా అని ప్రశ్నించారు. తాను ఎప్పుడు జగన్‌ను కలిసినా ప్రజల మధ్య మమేకం కావాలని సూచిస్తారన్నారు. ప్రజల మధ్య ఉండాలని ఆమె కార్యకర్తలకు సూచించారు.
తెలుగుదేశం పార్టీ మొదట జగన్‌ను, తర్వాత తనను, ఇప్పుడు పార్టీ కోసం పాదయాత్ర చేస్తున్న తన కూతురు షర్మిలను, ఆయన భర్త బ్రదర్ అనిల్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుందని విమర్శించారు. తమ కుటుంబాన్ని విమర్శించే వారికి సమాధానం చెప్పే రోజు వస్తుందన్నారు. అర్థం లేని ఆరోపణలతో జగన్‌ను జైలుకు పంపించారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయమ్మ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.
జగన్ ముఖ్యమంత్రి అవుతాడు
తన సోదరుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఆయన సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో అన్నారు. గుంటూరు జిల్లాలో ఆమె పాదయాత్ర కొనసాగుతోంది. పార్టీ రెండేళ్ల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆమె కేక్ కట్ చేసి మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి భవిష్యత్తు ఉందని, జగన్ ఖచ్చితంగా సిఎం అవుతారన్నారు. పార్టీ విజయాల వెనుక జగన్ కృషి ఉందన్నారు.












Click it and Unblock the Notifications