ఢిల్లీలో పడిపోతున్న కెసిఆర్ గ్రాఫ్? రాములమ్మకు షాక్

కెసిఆర్, విజయశాంతిలు లోకసభలో తెలంగాణ అంశం లేవనెత్తినప్పుడల్లా సుష్మా స్వరాజ్, అద్వానీ వంటి బిజెపి సీనియర్లు మద్దతు ప్రకటించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ, ఇటీవల వారికి బిజెపి నుండి కూడా సానుకూల స్పందన రావడం లేదట. ఇందుకు సోమవారం జరిగిన సమావేశాలే ఉదాహరణ అంటున్నారు. తెలంగాణ అంశంపై మాట్లాడేందుకు జీరో అవర్‌లో అవకాశం ఇస్తానని స్పీకర్ చెప్పినా కెసిఆర్ ఆర్ వినిపించుకోకపోవడంతో అధికార, విపక్ష సభ్యులంతా పలు వ్యాఖ్యలు చేశారట.
ఆరు నెలలకోసారి వస్తారు, సభకు ఇలా అడ్డుపడతారని, చాలు చాల్లే.. వెనక్కు వచ్చి కూర్చోండని మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు, సమాజ్‌వాదీ ఎంపీ నీరజ్ శేఖర్, బిఎస్పీ ఎంపి విజయ్ బహదూర్ సింగ్ తదితరులు వ్యాఖ్యానించారట. అంతేకాకుండా సభ వెలుపల అద్వానీకి విజయశాంతి నమస్కారం చేశారు. అయితే, ఆయన విసుగ్గా తల పక్కకు తిప్పుకున్నారట. విజయశాంతి తెరాసలో ఉన్నప్పటికీ బిజెపితో మంచి సంబంధాలు ఉన్నాయి.
గతేడాది అద్వానీ రథయాత్రలో విజయశాంతి పాల్గొన్నారు. పార్టీకి ఇష్టం లేకున్నా ఆమె యాత్రలో పాల్గొన్నారు. తనకు అద్వానీతో మంచి సంబంధాలు ఉన్నందువల్లే పాల్గొన్నానని ఆమె వివరణ ఇచ్చారు. కానీ, ఇప్పుడు మాత్రం అదే అద్వానీ ఆమె నమస్కారం చేసినా తలపక్కకు తిప్పుకోవడం గమనార్హం. తెలంగాణకు అనుకూలంగా ఉన్న తమ పార్టీ పట్ల కెసిఆర్ వైఖరి మింగుడు పడకనే బిజెపి వారికి అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదంటున్నారు.
జీరో అవర్‌లో కెసిఆర్ మాట్లాడతారని పలువురు భావించారు. కెసిఆర్‌కు దీటైన సమాధానం ఇవ్వాలని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడుఉండవల్లి అరుణ్‌కుమార్ సిద్ధమయ్యారు. అలాగే సభలో మాట్లాడేందుకు టిడిపి ఎంపీ నామా నాగేశ్వర రావు కూడా అవకాశం కోరారు. కానీ, అప్పటికే అద్వానీ అడ్డుకోవడం, ఇతర ఎంపీల వ్యాఖ్యానించిన నేపథ్యంలో కొద్దిగా ఇబ్బందిపడ్డ కెసిఆర్ జీరో అవర్ వరకూ వేచి ఉండకుండా సభ నుంచి వాకౌట్ చేశారంటున్నారు.
కాంగ్రెసు పార్టీ ఎంపీలు కూడా కెసిఆర్, విజయశాంతిలకు ముఖం చాటేశారు. ఓ వైపు తెరాస ఎంపీలు నిరసన తెలుపుతుంటే సభలో కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు కనిపించలేదు. ఒక ఎంపీ అప్పటి వరకూ అక్కడే ఉన్నప్పటికీ కెసిఆర్, విజయశాంతి స్పీకర్ పోడియం వద్దకు చేరగానే బయటకు వెళ్లిపోయారు. టిడిపి ఎంపి నామా కూడా కెసిఆర్ ఆందోళనకు మద్దతివ్వలేదు. వాకౌట్ చేసిన అనంతరం కెసిఆర్ బయటకు వచ్చి కాంగ్రెస్ ఎంపీల గురించి ఆరా తీశారు. ముగ్గురు ఎంపీలు సెంట్రల్ హాల్‌లో ఉన్నారని తెలియడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారట.












Click it and Unblock the Notifications