తమిళ ఈలంపై రెఫరెండం: కేంద్రానికి జయ హితవు

ఈ రెఫరెండం శ్రీలంకలోని తమిళ ప్రజలతో పాటు ప్రపంచంలోని తమిళులలో కూడా చేయాలన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా కౌన్సిల్‌లో ఓ తీర్మానం కూడా ప్రవేశ పెట్టాలని ఆమె సూచించారు. తమిళుల కోసం ప్రత్యేక ఈలం విషయంలో ఐరాసలో ప్రవేశ పెట్టాలని ఆమె అసెంబ్లీలో చెప్పారు.
శ్రీలంక తమిళుల అంశంపై తమిళనాడులోని అన్ని పార్టీలు తమ తమ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఒక పార్టీ మరో పార్టీ పైన దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఇప్పుడు అధికార అన్నాడిఎంకె పార్టీ మరో ముందడుగు వేసి తమిళ ఈలం డిమాండును మరోసారి తెరపైకి తీసుకు వచ్చింది.
తమిళ ఈలం విషయంలో కేంద్రం నిర్ణయం ప్రకటించేందుకు తమిళ పార్టీలు పట్టుబట్టే అవకాశముంది. ఇటీవల శ్రీలంక తమిళుల అంశంపై అమెరికా తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటేసింది. పాకిస్తాన్ మాత్రం శ్రీలంకకు అనుకూలంగా ఓటు వేసింది. ఈ రోజు జయలలిత సభలో తీర్మానం ప్రవేశ పెట్టారు.
శ్రీలంకలోని తమిళుల అంశంపై నిష్పక్షపాతంగా అంతర్జాతీయ స్థాయిలో స్వతంత్రంగా దర్యాఫ్తు జరగాలని జయలలిత అన్నారు. విచారణ అనంతరం తప్పు చేసిన వారిని అంతర్జాతీయ కోర్టులో దోషిగా నిలబెట్టాలన్నారు. అదే సమయంలో శ్రీలంకను మిత్ర దేశంగా కేంద్రం పేర్కొనడాన్ని జయలలిత తప్పు పట్టారు.
శ్రీలంకను మిత్ర దేశంగా పేర్కొనడాన్ని ఇప్పటికైనా ఆపేయాలని కోరారు. శ్రీలంకలోని తమిళుల రక్షణ పట్ల అక్కడి ప్రభుత్వం స్పందించే వరకు భారత ప్రభుత్వం ఆర్థిక ఆంక్షలు విధించాలని సూచించారు. శ్రీలంక తీరును నిరసిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులు తమ ఆందోళన విరమించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం శ్రీలంక తమిళుల రక్షణ కోసం కట్టుబడి ఉందన్నారు. త్వరలో తమ ప్రయత్నాలు సఫలం అవుతాయన్నారు.












Click it and Unblock the Notifications