విజయ్ సర్కార్ కు సుప్రీం బిగ్ రిలీఫ్..! మద్రాస్ హైకోర్టు ఆర్డర్ పై స్టే ..!
తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కరూర్ లో టీవీకే అధినేత విజయ్ (Vijay) నిర్వహించిన ర్యాలీలో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందులో 41 మంది చనిపోయారు. వీరి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పిస్తూ విజయ్ సర్కార్ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన మద్రాస్ హైకోర్టు (Madras High Court).. ఈ నిర్ణయాన్ని రద్దు చేసింది. దీంతో విజయ్ సర్కార్ సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
గతేడాది సెప్టెంబర్ లో చోటు చేసుకున్న కరూర్ తొక్కిసలాటలో మరణించిన 41 మంది మృతుల కుటుంబాల్లో ఒకరి చొప్పున విజయ్ సర్కార్ కారుణ్య నియామకాలు చేపట్టింది. దీన్ని తప్పుబట్టిన మద్రాస్ హైకోర్టు.. ఆ ఉద్యోగాలను రద్దు చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఇతరులు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై జస్టిస్ జె.బి.పార్దివాలా , జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ స్టే ఇచ్చింది. అలాగే తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఇతర అధికారులకు నోటీసులు జారీ చేసింది.

ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు.. బాధితుల కుటుంబాలకు ఉపాధి కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేయడంపై పిల్ వేసిన పిటిషనర్ కు ప్రశ్నలు వేసింది. ఒక విషాద సంఘటన బాధితులకు రాష్ట్రం ఉపాధి కల్పించడంలో సమస్య ఏమిటని ప్రశ్నించింది. అక్కడ తొక్కిసలాట జరిగింది, ప్రజలు మరణించారని పేర్కొంది. బాధిత కుటుంబాలకు కొంత ఉపశమనం , ఆర్థిక పరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు, ఉపాధి కల్పించే నిర్ణయాన్ని కూడా ప్రశ్నించడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.













Click it and Unblock the Notifications