తప్పించుకోలేరు, జగన్, సాయి బొమ్మ బొరుసు: సిబిఐ

ఈ కేసులో క్విడ్ ప్రోకో ఆధారాలు లభ్యమయ్యాయని, సిట్టింగ్ మంత్రుల పేర్లు నిందితుల లిస్టులో పెట్టామన్నారు. ఇప్పటికే ఐదు ఛార్జీషీట్లను దాఖలు చేశామని, మరో ఆరు అంశాలపై దర్యాఫ్తు కొనసాగుతోందని, అందులో మూడింటిపై స్క్టూట్నీ జరుగుతోందని, అది పూర్తయ్యాక వాటిపై ఛార్జీషీట్లు దాఖలు చేస్తామని చెప్పారు. అభియోగాల నమోదు ప్రక్రియ అడ్డుకునేందుకే జగన్, విజయ సాయి రెడ్డిలు మెమోలు దాఖలు చేశారన్నారు.
జగన్ కేసు అసాధారణమైన ఆర్థిక నేరంతో కూడుకున్నదని, విచారణకు మరింత సమయం పడుతుందని చెప్పారు. ఈ కేసులో ఇద్దరు మంత్రులతో పాటు ఓ మాజీ మంత్రిని నిందితులుగా పేర్కొన్నామన్నారు. అన్ని అంశాలపై దర్యాఫ్తు చేయాలని హైకోర్టు నుండి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. లంచంగా వచ్చిన సొమ్ముకు చట్టబద్దత కల్పించేందుకు కార్పోరేట్ కలర్ వేశారన్నారు.
జగన్ సాయి బొమ్మా బొరుసు
ఈ కేసులో విజయ సాయి రెడ్డిది కీలక పాత్ర అన్నారు. లంచాలకు కార్పోరేట్ కలర్ ఇచ్చారన్నారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు విజయ సాయి మధ్యవర్తిత్వం వహించారని చెప్పారు. విజయ సాయి సమన్వయకర్తగా పని చేశారని, ఇవన్నీ జగన్ కోసమే జరిగాయన్నారు. పెట్టుబడిదారులను సాయి బెదిరించారన్నారు. అక్రమాస్తులు సమకూర్చడంలో ఆయన పాత్ర ఉందన్నారు. జగన్, సాయి రెడ్డిలను వేర్వేరుగా చూడలేమని, ఇద్దరు బొమ్మాబోరుసులు అన్నారు. విచారణ జాప్యం చేసేందుకు ఎత్తులు వేస్తున్నారన్నారు.
జగన్ తప్పించుకోలేరు
ఈ కేసు నుండి జగన్ తప్పించుకోలేరని సిబిఐ తరఫు న్యాయవాది అన్నారు. ఈ కేసులో ప్రజాప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. కేసు విచారణ పారదర్శకంగా సాగుతోందన్నారు. దాల్మియా ఛార్జీషీటులో కీలక మంత్రిని నిందితురాలిగా పేర్కొన్నామన్నారు. అభియోగాల ప్రక్రియ ఆపమనడం చట్టంలో ఎక్కడా లేదన్నారు. కేసుకు సంబంధించిన అన్నింటిని ఒకే దగ్గర విచారించడం కుదరదన్నారు. అక్రమ పెట్టుబడుల కోసం కొన్ని కంపెనీలు సృష్టించారన్నారు.
సుప్రీం ఆదేశాలు ఉల్లంఘించలేదు
సిబిఐ ఎక్కడా సుప్రీం కోర్టు ఆదేశాలు ఉల్లంఘించలేదని చెప్పారు. ఛార్జీషీట్ల పైన సిబిఐ లాయరు స్పష్టత ఇచ్చారు. సుప్రీం కోర్టు చెప్పినట్లుగానే విచారణ చేస్తున్నామన్నారు.
తీర్పు 27కు వాయిదా
సిబిఐ వాదనలు విన్న అనంతరం కోర్టు తీర్పును ఈ నెల 27వ తేదికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications