ఇలా టార్గెట్ చేశారు: కిరణ్‌ను చిక్కుల్లో పడేసిన డిఎల్

కిరణ్ ఏరికోరి తీసుకున్నప్పటికీ శంకర రావుతో సమానంగా డిఎల్ పెద్ద అసమ్మతివాదిగా ముద్రపడ్డారు. పలు సందర్భాలలో ఆయన కిరణ్ తీరును తప్పు పట్టారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా ఆయన ఆసుపత్రుల్లో మందులు లేకపోవడంతో... సిగ్గుతో తలదించుకుంటున్నాను, మందుల్లేవు, వైద్యులులేరు, ఇలాంటి వైద్యారోగ్య శాఖను ఇచ్చారని ఓ సందర్భంలో ఆవేదన చెందారు.
కిరణ్‌ను ఉద్దేశించి పరోక్షంగా... అధికారం కోసం కొందరు గడ్డి తినే వాళ్లున్నారని, అలాగే ఉన్నత పదవులు పొందారని, సూట్ కేసులు పట్టుకొని ఢిల్లీ వెళ్లి పదవులు పొందారని, తన మనసు గాయపడిందని, అధిష్టానం అర్థం చేసుకుందని, కఠిన నిర్ణయం విరమించుకున్నానని, పదవి ఉన్నా లేకున్నా పార్టీ కోసం పని చేస్తానని తన శాఖలో కోత విధించిన సమయంలో అన్నారు.
టిడిపి నేత ఎర్రన్నాయుడు మృతి చెందినప్పుడు మాట్లాడుతూ... మా సర్కారు తీరు సిగ్గు సిగ్గు అని, రోడ్డు ప్రమాదానికి గురైన ఎర్రన్నాయుడిని తరలించిన అంబులెన్సులో ఆక్సిజన్ లేదని, తర్వాత వచ్చిన 108లోను లేదని నిప్పులు చెరిగారు.
ధర్మాన ప్రసాద రావు రాజీనామా ఆమోదించాలని డిమాండ్ చేస్తూ... మోపిదేవి వెంకటరమణ నిజమైన బిసి నేత అని, ఆయనను ఎందుకు కాపాడలేక పోయారని, ధర్మానకో న్యాయం, ఆయనకో న్యాయమా అని ప్రశ్నించారు. వాన్ పిక్ భూముల కేటాయింపు కేసులో ధర్మానను విచారించేందుకు సిబిఐకి అనుమతి ఇవ్వరాదనే కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. తన నిర్ణయం అభ్యంతకరమని, అలా నమోదు చేసుకోకుంటే తాను గవర్నర్‌ను కలిసి వివరిస్తానని చెప్పారు. ఆ తర్వాత ఆయన గవర్నర్‌ను కలిశారు.
మంత్రి మండలికి విచక్షణాధికారం ఉందని కేసులు ఎత్తివేయవద్దని, ముఖ్యమంత్రి తన పద్ధతిని మార్చుకోవాలని మరో సందర్భంలో అన్నారు. బంగారు తల్లి పథకంపై స్పందిస్తూ... పాత పథకానికే పేరు మార్చినట్లుగా కనిపిస్తోందన్నారు. ఈ పథకం సరిగా అమలు కాకుంటే తమను తరిమి కొట్టమని ప్రజలకు సూచిస్తానన్నారు. కాగా డిల్ బర్తరఫ్ చాలా బాధాకరమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి ఆదివారం అన్నారు.












Click it and Unblock the Notifications