మోడీ వర్సెస్ అద్వానీ: బిజెపి వార్‌లో నిరసనలు
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో ఎల్‌కె అద్వానీకి, నరేంద్ర మోడీకి మధ్య పోరు తీవ్రమైనట్లే కనిపిస్తోంది. మోడీ అభిమానులు శనివారం అద్వానీ నివాసం ముందు నిరసన ప్రదర్శన చేశారు. మోడీపై వ్యతిరేకతతోనే అద్వానీ గోవాలో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరు కావడం లేదని నిరసిస్తూ వారు ప్రదర్సనకు దిగారు. మోడీకి అద్వానీ మార్గం సుగమం చేయాలని, లోకసభ ఎన్నికల ప్రచార సారథిగా మోడీని అంగీకరించాలని వారు డిమాండ్ చేశారు.
ఆరోగ్య కారణాలను సాకుగా చూపి అద్వానీ జాతీయ కార్యవర్గ సమావేశానికి డుమ్మా కొట్టారు. ప్రచార కమిటీ చీఫ్‌గా మోడీని వ్యతిరేకిస్తూనే ఆయన సమావేశానికి హాజరు కాలేదని అంటున్నారు. మోడీకి ప్రమోషన్ ఇవ్వడానికి ఆర్ఎస్ఎస్ అంగీకరించినట్లు చెబుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల ప్రచార సారథిగా మోడీ పేరును బిజెపి ప్రకటించే అవకాశం ఉంది.

తాను అద్వానీకి ఫోన్ చేశానని, నిజంగానే అద్వానీ ఆరోగ్యం బాగా లేదని పార్టీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ ప్రతాప్ రూడీ చెప్పారు. బిజెపి అధికార ప్రతినిధి షాహనవాజ్ హుస్సేన్ కూడా దాదాపు అదే మాట అన్నారు. కాంగ్రెసుకు తమ పార్టీ భిన్నమైందని, తమ పార్టీలో శిబిరాలు ఉండవని జాతీయ కార్యవర్గ సభ్యుడు నళిన్ కోహ్లీ అన్నారు.
అద్వానీ శిబిరం డుమ్మా
అద్వానీ మద్దతుదారులు వరుణ్ గాంధీ, జస్వంత్ సింగ్, ఉమా భారతి సమావేశానికి డుమ్మా కొట్టారు. మనోహర్ పరికర్, స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్, బల్బీర్ పుంజ్ వంటి నేతలు బహిరంగంగానే మోడీకి మద్దతు ప్రకటించారు. దీంతో బిజెపిలో అద్వానీ, మోడీ శిబిరాల మధ్య అంతరం మరింత పెరిగింది.
అద్వానీ లేని సమయంలో మోడీకి ప్రమోషన్ కల్పిస్తూ ప్రకటన చేయవద్దని అద్వానీ మద్దతుదారులు అంటుండగా, అద్వానీ లేకున్నా సరే ప్రకటించాల్సిందేనని మోడీ వర్గీయులు అంటున్నారు.












Click it and Unblock the Notifications