మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కావూరికి చోటు

ఆయనకు కేబినెట్ హోదా కల్పించనున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం ఐదున్నర గంటలకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరుగుతోంది. జెడి శీలంతో పాటు కావూరి సాంబశివరావుకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశాలున్నట్లు పిటిఐ వార్తా సంస్థ తెలిపింది. కావూరి సాంబశివ రావుకు ఆదివారం ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన ఢిల్లీకి బయలుదేరి వచ్చారు.
ఇది వరకు రెండు సార్లు విస్తరణ జరిగినప్పుడు కూడా ఆయన మంత్రి పదవిని ఆశించారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో కావూరి సాంబశివరావు అలక వహించి రాజీనామా లేఖను కూడా సమర్పించారు. అయితే, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పిలిచి మాట్లాడిన తర్వాత ఆయనలో మార్పు వచ్చింది. లోకసభలో సీనియర్ పార్లమెంటు సభ్యుడిగా ఆయనకు గుర్తింపు ఉంది.
కావూరి సాంబశివరావుకు కేబినెట్ హోదా ఇవ్వడం ద్వారా తెలంగాణకు చెందిన ఎస్ జైపాల్ రెడ్డి స్థాయిలో మన్మోహన్ సింగ్ ఆయనను నిలబెడుతున్నారు. రాష్ట్రం నుంచి ఇద్దరికి మాత్రమే మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. గత విస్తరణలో తెలంగాణకు చెందినవారికి మంత్రివర్గంలో ప్రాధాన్యం లభించింది. ఇప్పుడు కోస్తాంధ్రకు చెందిన ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా ప్రాంతీయ సమతుల్యతను పాటించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
సిడబ్ల్యుసిలో శాశ్వత ఆహ్వానితుడిగా నియమించడం ద్వారా కావూరికి మంత్రివర్గంలో చోటు ఇవ్వకూడదని కాంగ్రెసు అధిష్టానం నిర్ణయించుకున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే, కావూరికి తగిన ప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశంతోనే మంత్రి పదవి కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications