తెలంగాణ: కెకెతో కాంగ్రెసు అధిష్టానం తెర వెనుక

ప్రత్యేక తెలంగాణ అంశంపైనే ఆ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ ప్రధాన కార్యదర్శి ఒకరు కేశవరావుతో దాదాపు గంటపాటు చర్చలు జరిపినట్లు సమాచారం. తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు పరిశీలిస్తున్న పలు ప్రతిపాదనలపై సమాలోచనలు సాగినట్టు సమాచారం. రాయల తెలంగాణను ఏర్పాటు చేయటమా? లేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామనే హామీతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించటమా? లేక హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పెట్టి రాష్ట్ర విభజన చేయటమా? అనే మూడు, నాలుగు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్టు వార్తలు రావటం తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఈ ప్రతిపాదనలన్నింటిపై కేశవరావుతో చర్చించారని అంటున్నారు. కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనలపై కేశవరావు తెరాస అభిప్రాయాన్ని ప్రధాన కార్యదర్శికి వివరించారనీ, దీనిపై కాంగ్రెస్ ఎంతవరకు సర్దుబాటు చేయగలదు, ఏ మేరకు దిగిరాగలుగుతుందనేది ఆయన వివరించారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే పక్షంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలనేది కూడా చర్చించి ఉంటారని అంచనా వేస్తున్నారు.
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల అనంతరం తమకు మద్దతిచ్చే విధంగా తెరాస, మజ్లీస్‌లను ఒప్పించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోందని చెబుతున్నారు. కేశవరావు సదరు ప్రధాన కార్యదర్శితోపాటు కాంగ్రెస్‌కు చెందిన మరో సీనియర్ నేతతోనూ చర్చలు జరిపినట్టు తెలిసింది. ఇదిలాఉంటే కేశవరావు మంగళవారం కేంద్ర సైన్సు, టెక్నాలజీ శాఖ మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డిని కలుసుకుని తెలంగాణ ఏర్పాటు అంశంపై మంతనాలు సాగించారు.












Click it and Unblock the Notifications