కావూరి అప్పుడలా.. ఇప్పుడిలా, జగ్గారెడ్డి ఏక్ నిరంజన్

'తెలంగాణ' అంటేనే ఒంటికాలిపై లేచే వారిలో కావూరి ఒకరు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటాలని, తెలంగాణ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోను ఊరుకునేది లేదని ఆయన గతంలో ఎన్నోసార్లు వాదించారు. సమైక్యాంధ్ర ఉద్యమ నాయకుడయ్యారు. తెలంగాణలో విభజన కోసం వివిధ కార్యక్రమాలు జరిగినప్పుడు ఆయన తీవ్రంగా స్పందించేవారు. హైదారాబాదుతో కూడిన తెలంగాణ కావాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తే వారి సొత్తు కాదని మండిపడ్డారు.
ఓ సమయంలో తెలంగాణ ప్రాంత నేతలు పదవుల కోసమే జిమ్మిక్కులు అంటూ వ్యాఖ్యానించారు. అంతటి కరడుగట్టిన సమైక్యవాది ఒక్కసారిగా విభజనపై రూటు మార్చారు. అయితే అందుకు ఆయనకు వచ్చిన మంత్రి పదవే కారణమని అంటున్నారు. మంత్రి పదవి రాగానే కావూరి సమైక్యవాదాన్ని పక్కన పెట్టడం సరికాదని సమైక్యవాదులు భగ్గుమంటున్నారు. కావూరి తీరు ఇలా ఉంటే... తెలంగాణవాది అయిన ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి దాదాపు సమైక్యవాదిగా మారిపోవడం గమనార్హం.
తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించినప్పుడు తెలంగాణ కోసమంటూ జగ్గారెడ్డి ఆ పార్టీలో చేరారు. 2004లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. అనంతరం పలు పరిణామాల నేపథ్యంలో జగ్గా రెడ్డి కాంగ్రెసు పార్టీలో చేరిపోయారు. నిన్నటి వరకు తెలంగాణవాదం బలంగా వినిపించిన జగ్గారెడ్డి ఇప్పుడు సమైక్యవాదం వినిపిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంలోనే తెలంగాణ వారికి ఉద్యోగాలు, ప్రాంతం అభివృద్ధి అని చెప్పిన జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి దగ్గరైన తర్వాత గొంతు మార్చారని అంటున్నారు.
కెసిఆర్ పైన కోపమో మరేమో కానీ జగ్గా రెడ్డి మాత్రం కిరణ్‌కు దగ్గరయ్యాక తెలంగాణను వ్యతిరేకిస్తున్నారు. ఆ విషయాన్ని ఆయన బాహాటంగానే చెబుతున్నారు. తెలంగాణ సెంటిమెంట్ దృష్ట్యా పలువురు తెలంగాణలోని పలువురు సమైక్యవాదులు తెలంగాణ వైపు మొగ్గు చూపుతున్నారు. జగ్గారెడ్డిలా తెలంగాణ నేతలు ఎవరు బాహాటంగా సమైక్యానికి మద్దతు పలకడం లేదు. అలాంటి నేతలు కూడా సెంటిమెంట్ దృష్ట్యా మనసు మార్చుకుంటున్నారు.
అదే జగ్గా రెడ్డి క్రమంగా తెలంగాణ నుండి సమైక్యవాదం వైపుకు వెళ్తున్నారు. తెలంగాణ ప్రాంత నేతల్లో మంత్రులు ముఖేష్ గౌడ్, దానం నాగేందర్ వంటి నేతలు తెలంగాణకు అనుకూలంగానే ఉన్నారు. కానీ తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతల చర్చల్లో వారు పాలుపంచుకోవడం తక్కువ. అయితే జగ్గారెడ్డికి, వీరికి తేడా ఉంది. జగ్గారెడ్డి తెలంగాణవాదం ఉన్న మెదక్ జిల్లా నుండి ప్రాతినిథ్యం వహిస్తే, ఇద్దరు మంత్రులు హైదరాబాద్ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
జగ్గా రెడ్డి ఈరోజు మాట్లాడుతూ ఈ నెల 30న జరిగే సభకు తాను ఎట్టి పరిస్థితుల్లో హాజరుకానని అన్నారు. తెలంగాణ ఇచ్చినా, ఇవ్వకున్నా అభివృద్ధే తన లక్ష్యమన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనేది అవాస్తవమని, ఎలా వస్తాయో చెప్పాలన్నారు. కేంద్రం తెలంగాణ ఇస్తే పార్టీలో ఉండాలో వద్దో ఆలోచిస్తానని అన్నారు.












Click it and Unblock the Notifications