రాయలాంధ్రకు ఒంగోలు: వాన్‌పిక్ భూమిలో రాజధాని?

అదే సమయంలో సీమాంధ్ర రాజధాని పైనా చర్చ సాగుతోంది. కొత్త రాజధాని ఏర్పాటుకు పెద్ద ఎత్తున అవసరమయ్యే భూముల లభ్యత దృష్ట్యా ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలును రాజధాని చేయవచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రత్యేకించి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వాన్‌పిక్ కోసం సేకరించిన వేలాది ఎకరాల భూములు నిరుపయోగంగా ఉండగా వాటిలో మూడొంతులకు పైగా ఒంగోలు సమీపంలో ఉన్నాయి.
డిసెంబర్ 9 ప్రకటన తర్వాత నుంచీ కోస్తాంధ్రకు రాజధానిగా ఒంగోలుపై చర్చ సాగుతోంది. నాలుగేళ్ల కిందట ఈ ప్రచారంతోనే ఒంగోలుకు సుమారు 50 కిలోమీటర్ల వరకు ప్రత్యేకించి జాతీయ రహదారి ప్రాంతంలో భారీగా భూముల కొనుగోళ్లు, అమ్మకాలు జరిగాయి. అయితే, అనంతపురం, కర్నూలు సహా తెలంగాణ జిల్లాలతో రాయల తెలంగాణను ఏర్పాటు చేస్తారని, కడప, చిత్తూరు సహా కోస్తాంధ్ర జిల్లాలతో సీమాంధ్రను ఏర్పాటు చేయవచ్చన్న తాజా ప్రచారంతో రాజధానిగా ఒంగోలు అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
విభజన అంశం తెరపైకి వచ్చినప్పుడు కోస్తాంధ్ర ప్రాంతానికి రాజధానిగా విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి తెరపైకి వచ్చాయి. విశాఖపట్నం అయితే ఒక మూలకు ఉండగా, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో రాజధానికి అవసరమైన స్థాయిలో ప్రభుత్వ భూములు లేవని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒంగోలు రాజధానిగా ఉండవచ్చుననే ప్రచారం సాగుతోంది.
విభజన జరిగితే మరో రాజధాని అవసరముంటుంది. ప్రకాశం, గుంటూరు జిల్లాలో వాన్‌పిక్ కోసం 28 వేల ఎకరాలు కేటాయించగా, వాటిలో మూడొంతుల భూములు ప్రకాశం జిల్లాలోనే ఉన్నాయి. అవి ఒంగోలుకు సమీపంలో ఉన్నాయి. దీంతో కొత్త రాజధాని ఏర్పాటుకు వాన్‌పిక్ భూములతోపాటు మరో 10, 15 వేల ఎకరాలను సులభంగా సేకరించవచ్చని కాంగ్రెస్ భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications