విభజన ఎఫెక్ట్: ఇప్పటికి టిడిపి తెలంగానం, జగన్ సైలెన్స్
హైదరాబాద్: విభజనపై జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో తెలంగాణ విషయంలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం వస్తుందని, రాయల తెలంగాణ ఇస్తారని.. ఇలా ఎన్ని రకాలుగా ప్రచారాలు జరిగినా అధినేత హుకుంతో ఇరు ప్రాంతాల టిడిపి నేతలు పెదవి విప్పటం లేదు. శోభా నాగి రెడ్డి వంటి నేతలు తప్పితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉంది.
టిడిపి తెలంగాణపై దాదాపు మౌనం దాల్చితే.. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, ఇతర నేతలు తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు. అయితే రెండు రోజుల క్రితం విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ.. విభజన నిందను టిడిపి పైన వేశారు. తాజాగా గురువారం కెఈ కృష్ణమూర్తి తెలంగాణకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో తీర్మానం పెడితే ఆలోచిస్తామన్నారు.

తెలంగాణకు అనుకూలంగా తమ పార్టీ ఎప్పుడో నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారు. రాయల తెలంగాణను ఒప్పుకునేది లేదన్నారు. రాయల తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం పెడితే కచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పారు. తెలంగాణపై తీర్మానం పెడితే మాత్రం అప్పటి పరిస్థితిని బట్టి చూస్తామన్నారు. విభజనపై ప్రస్తుతం జరుగతున్న ప్రచారం అంతా కాంగ్రెసు వ్యూహంలో భాగమేనని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారట.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా వ్యూహాత్మకంగా స్పందిస్తోంది. తెలంగాణ నిందను లగడపాటి టిడిపి పైన వేస్తే, మంత్రి టిజి వెంకటేష్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన వేశారు. దీనిపై ఆ పార్టీ నేతలు ఏమాత్రం స్పందించలేదు. ఎలా స్పందించినా ఇబ్బంది ఎదురవుతుందని భావించినందు వల్లే.... లగడపాటి వ్యాఖ్యల పైన టిడిపి, టిజి వ్యాఖ్యల పైన జగన్ పార్టీ స్పందించలేదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications