కోర్ కమిటీపై సస్పెన్స్: సీమాంధ్రుల్లో ఆందోళన, టి ధీమా

ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు కోర్ కమిటీ భేటీ కానుంది. ఈ భేటీకి ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. సోనియా గాంధీ, దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్ తదితరులు ఈ భేటీలో పాల్గోనున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణలు ఇచ్చిన రోడ్ మ్యాప్ పైన చర్చించనున్నారు. సాయంత్రం అందుబాటులో ఉండాలని నేతలకు సూచించింది.
అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందనే విషయమై సస్పెన్స్ కొనసాగుతోంది. కిరణ్ సమైక్యాంధ్రకు, దామోదర తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఇచ్చే అవకాశాలున్నాయి. బొత్స సమైక్యాంధ్ర అని చెబుతూనే అధిష్టానంపై భారం వేసే అవకాశాలున్నాయి. ఆయన తాజా రాజకీయ పరిస్థితులను అందులో ప్రస్తావించారని సమాచారం. ప్యాకేజీ మాట వెనక్కి వెళ్లి విభజనకే మొగ్గు చూపుతుందనే అభిప్రాయానికి ఇరు ప్రాంతాల నేతలు వచ్చినట్లుగా కనిపిస్తోంది.
అయితే అది ఏ రకంగా ఉంటుందనే దాని పైన కూడా ఉత్కంఠ ఉంది. హైదరాబాదు లేని తెలంగాణ అని, హైదరాబాదుతో కూడిన తెలంగాణ అని, కొన్నేళ్లు ఉమ్మడి రాజధాని అని, రాయల తెలంగాణ అని.. ఇలా పలురకాల వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ఉంటుందనే ధీమా తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతల్లో కనిపిస్తోంది. అయితే సీమాంధ్ర నేతల్లో మాత్రం ఆందోళన కనిపిస్తోంది. ఏం జరుగుతుందనే ఉత్కంఠ మాత్రం ఇరు ప్రాంతాల నేతల్లో ఉందనే చెప్పవచ్చు.
ఈ నేపథ్యంలో ఎవరికి వారు నేతలు ఢిల్లీ పెద్దలను కలుస్తున్నారు. దిగ్విజయ్ సింగ్‌తో తెలంగాణ ప్రాంత నేతలు జానారెడ్డి, పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు భేటీ అయ్యారు. మంత్రి టిజి వెంకటేష్ మాట్లాడుతూ.. ఇప్పుడు కేవలం చర్చలు మాత్రమేనని, నిర్ణయం ఉండదని అన్నారు.












Click it and Unblock the Notifications