వారికి షాకిచ్చారు: లెక్కతప్పింది, జగన్ ఆసక్తి (పిక్చర్స్)
హైదరాబాద్: తొలి దశ పంచాయతీ ఎన్నికలలో పలు ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. కీలక నేతల లెక్క తప్పింది! నియోజకవర్గాలలో పట్టు నిలుపుకున్న కొందరు ముఖ్య నేతలు సొంత గ్రామంలో మాత్రం తమ అభ్యర్థులను గెలిపించుకోలేకపోయారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన సొంత జిల్లా చిత్తూరులో తేలిపోయారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రాతినిథ్యం వహిస్తున్న మహబూబ్ నగర్ నియోజకవర్గంలోను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లె ఉన్న పంచాయతీ మాత్రం టిడిపి వశమైంది.
మంత్రి శ్రీధర్ బాబు స్వగ్రామం మంథని మేజర్ పంచాయతీలో ఉంది. ఇక్కడ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి గెలుపొందారు. బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా గంగాపురం. అక్కడ కిషన్ రెడ్డి మద్దతిచ్చిన అభ్యర్థి తెలుగుదేశం పార్టీ మద్దతుదారు చేతిలో ఓటమి చవిచూశారు. ఇదే జిల్లాకు చెందిన మంత్రి డికె అరుణ తన స్వగ్రామం ధర్మారంలోను జగన్ పార్టీ అభ్యర్థే గెలుపొందారు.

మోత్కుపల్లి నర్సింహులు
తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష ఉప నేత మోత్కుపల్లి నర్సింహులు స్వగ్రామంలో తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతుదారుడు గెలుపొందారు. ప్రకాశం జిల్లా అద్దంకి మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తల్లి ఓటమిపాలయ్యారు.

సీతక్క
తెలుగుదేశం పార్టీ వరంగల్ జిల్లా ఎమ్మెల్యే సీతక్క స్వగ్రామమైన ములుగు మండలం జగ్గన్నపేటలో తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతుదారుడు గెలుపొందారు. మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యే కొత్తకోట దయాకర రెడ్డి స్వగ్రామం పర్దిపూర్‌లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుదారుడు గెలుపొందారు.

డికె అరుణ
మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ ఎమ్మెల్యే, మంత్రి డికె అరుణ స్వగ్రామం ధన్వాడ మండలం ధర్మారంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుదారుడు గెలుపొందారు. కాంగ్రెసు ఎమ్మెల్యే నర్సారెడ్డి సొంత ఊరు మెదక్ జిల్లా వర్గల్లో టిడిపి మద్దతుదారు గెలుపొందారు.

మంద జగన్నాథం
ఇటీవలె కాంగ్రెసు నుండి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన పార్లమెంటు సభ్యుడు మంద జగన్నాథం స్వగ్రామం ఇటిక్యాల మండలం కొండేరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సానుభూతిపరుడు విజయం సాధించారు.

మేకపాటి రాజమోహన్ రెడ్డి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి స్వగ్రామం మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థి ఓడిపోయారు.

వైయస్ జగన్
తొలి దశ పంచాయతీ ఎన్నికలు ఫలితాలు వస్తున్న సమయంలో అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్ గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉత్కంఠగా చూశారట. అధికారులను ఎప్పటికి అప్పుడు అడిగి తెలుసుకున్నారట.
గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం పంచాయతీలో ఇటీవలే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన మోపిదేవి వెంకటరమణ తమ్ముడి సతీమణి విజయనిర్మల గెలుపొందారు. అనంతపురం జిల్లాలో టిడిపి నేత నిమ్మల కిష్టప్ప సొంతూరులో కాంగ్రెసు మద్దతుదారు, ఆయన ఉంటున్న గోరంట్లలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుదారు, పుట్టపర్తి ఎమ్మెల్యే సొంతూరు ఓరువాయిలో జగన్ పార్టీ మద్దతుదారు గెలుపొందారు.
సబితా ఇంద్రా రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మహేశ్వరం ఎక్కువ స్థానాలు గెలుచుకోలేకపోయింది. కెఎల్ఆర్ నియోజకవర్గంలో స్వతంత్రుల హవా కొనసాగింది. తూర్పు గోదావరిలోను ఇద్దరు ఎమ్మెల్యేలు తమ సొంతూరులో తమ మద్దతుదారులను గెలిపించుకోలేకపోయారు. టిడిపి నేతలు మోత్కుపల్లి నర్సింహులు, ఉమా మాధవ రెడ్డి స్వగ్రామంలోను ప్రభావం చూపలేదు. అక్కడ తెరాస నేతలు గెలిచారు.అయితే ఉమా మాధవ రెడ్డి నియోజకవర్గంలో పట్టు నిలుపుకున్నారు.
ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి స్వగ్రామం మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో జగన్ పార్టీ మద్దతుదారు ఓడిపోయారు. జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ సతీమణి తోడి కోడలు ఆశ్రితపై గెలుపొందారు. తెరాసలో చేరిన మంద జగన్నాథం స్వగ్రామం ఇటిక్యాల మండలం కొండేరులో జగన్ పార్టీ మద్దతుదారు, టిడిపి ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి స్వగ్రామం పర్దిపూర్‌లో స్వతంత్ర అభ్యర్థి, టిడిపి ఎమ్మెల్యే సీతక్క స్వగ్రామం ములుగు మండలం జగ్గన్నపేటలో తెరాస మద్దతుదారు, మంత్రి కొండ్రు మురళి సొంత పంచాయతీ లావేరులో టిడిపి మద్దతుదారు గెలుపొందారు.
కాగా రాష్ట్రవ్యాప్తంగా వేలం నిర్వహించిన 18 పంచాయతీలకు మళ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ చెప్పారు. ఈ 18 పంచాయతీలకు సంబంధించి బుధవారం రీనోటిఫికేషన్ విడుదల చేశారు. 18 పంచాయతీలకు ఆగస్టు 8న ఎన్నికలు జరుగనున్నాయి.
మరోవైపు అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్ గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పంచాయతీ ఎన్నికల ఫలితాల సరళిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారట. జగన్ ఉన్న బ్యారక్‌లో టివిలో కేవలం దూరదర్శన్ మాత్రమే వస్తుంది. దీంతో అతను జైలు సిబ్బందిని ఫలితాల గురించి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారట.












Click it and Unblock the Notifications