తెలంగాణలో తేలిపోయిన జగన్ పార్టీ, కెసిఆర్‌కు షాక్

కడప, విశాఖపట్నం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముందు నిలిచింది. మిగతా పలు జిల్లాల్లో పోటాపోటీగా నిలిచింది. తెలంగాణ విషయానికి వస్తే మాత్రం కాంగ్రెసు, టిడిపిలు తెరాసకు గట్టి పోటీ ఇవ్వగా.. వైయస్సార్ కాంగ్రెసు మాత్రం సత్తా చాటలేకపోయింది. కేవలం మహబూబ్ నగర్ జిల్లాలోనే అత్యధిక స్థానాలను గెలుచుకుంది. రంగారెడ్డి, మెదక్, నిజామాబ్ద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో చెప్పుకోదగ్గ స్థానాల్లో గెలువలేదు.
కెసిఆర్‌కు షాక్
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రాతినిథ్యం వహిస్తున్న మహబూబ్ నగర్‌లో ఆ పార్టీ తేలిపోయింది. రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల్లో తెరాస కాంగ్రెసు, టిడిపిల కంటే ముందు నిలువలేకపోయింది. అయితే మెదక్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో సత్తా చాటింది.
కెసిఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న పాలమూరులో మాత్రం కాంగ్రెసు, టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు మొదటి మూడు స్థానాల్లో ఉండగా తెరాస నాలుగో స్థానంలో నిలిచింది. కాగా పంచాయతీ ఎన్నికలలో కెసిఆర్ ఓటు వేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. తన స్వగ్రామమైన మెదక్ జిల్లా సిద్దిపేట మండలం చింతమడకలో ఆయనకు ఓటు హక్కు ఉంది. తెలంగాణపై పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ చెప్పుకోదగ్గ స్థానాల్లో గెలువలేదు. వామపక్షాలు పలు చోట్ల గెలుపొందాయి.












Click it and Unblock the Notifications