మేం సై: టి మంత్రుల కౌంటర్ భేటీ, తనది కాదని జైపాల్

సీమాంధ్ర మంత్రుల సమైక్య ప్రయత్నాలను అడ్డుకునే దిశలో తెలంగాణ మంత్రులు భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు లేదా రేపు ఉదయం భేటీ కావాలని భావిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి తెలంగాణ మంత్రులకు స్వయంగా ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. సీమాంధ్ర నేతలకు ధీటుగా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు సిద్ధమవుతామని, అందుకు ఓసారి భేటీ అవుదామని వారికి సూచించినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు లేదా రేపు మంత్రులు భేటీ అయ్యే అవకాశాలున్నాయి.
తన ప్రతిపాదన కాదన్న జైపాల్
కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఇవ్వాలన్న ప్రతిపాదన తమది కాదని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి వర్గం చెబుతోంది. జైపాల్ రాయల తెలంగాణను ప్రతిపాదించినట్లుగా వార్తలు వచ్చాయి. వాటిని ఆయన వర్గం తోసిపుచ్చింది. పది జిల్లాలతో కూడిన తెలంగాణనే జైపాల్ కోరుకుంటున్నారని చెప్పారు.
అడ్డుకోవద్దు: గుత్తా
విభజన ప్రక్రియ ప్రారంభమైనప్పుడు సీమాంధ్ర నేతలు రాజీనామాల పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో పలు జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీయే ముందంజలో నిలిచిందని, అందుకు కాంగ్రెసు తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం ప్రజల్లో ఉండటమే అన్నారు. రాజీనామాలు చేసినంత మాత్రాన అధిష్టానం తగ్గదని, రాష్ట్రపతి పాలన వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications