పంచాయతీ: తెలంగాణపై జగన్ వ్యూహం మారిందా?
హైదరాబాద్: తొలి దశ పంచాయతీ ఎన్నికలతో తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వ్యూహం మారిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో తగిన ఫలితాలు సాధించకపోవడం వల్ల, తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ పుంజుకోవడం వల్ల ఆయన వైఖరి మారిందనే ప్రచారం సాగుతోంది. తెలంగాణలో మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాస్తా గుర్తించదగిన ఫలితాలు సాధించింది. దీంతో తెలంగాణను వదులుకోవడం మంచినదే అభిప్రాయానికి వచ్చారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
జగన్ వ్యూహంలో భాగంగానే తెలంగాణపై కాంగ్రెసు చర్యను తప్పు పడుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ఒక్కరొక్కరే రాజీనామాలు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైయస్ జగన్ కనుసన్నల్లోనే ఆ రాజీనామాల వ్యవహారం నడుస్తుందని అంటున్నారు. రాజీనామాలు చేసినవారు వైయస్ జగన్‌కు అత్యంత సన్నిహితులు కావడం వల్ల అలాంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం విధానాన్ని తప్పుపడుతూ రాజీనామాలు చేసిన బాలినేని శ్రీనివాస రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు జగన్ మాటలను జవదాటేవారు కాదు.

తెలంగాణవాదం బలంగా ఉన్న కరీంనగర్, వరంగల్, మెదక్ వంటి జిల్లాలను వదిలేసి, తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించడం ద్వారా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం వంటి జిల్లాల్లో తమ బలిమితో కొన్ని స్థానాలను సంపాదించుకుంటే సరిపోతుందనే అభిప్రాయానికి జగన్ వచ్చినట్లు చెబుతున్నారు. తెలంగాణ వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తూ, సమైక్యవాదానికి పూర్తి అండగా నిలబడితే సీమాంధ్రలో పూర్తి స్థాయిలో ఇతర పార్టీలను అధిగమించి సత్తా చాటవచ్చునని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తెలంగాణ అనుకూల వైఖరి రాష్ట్ర విభజనకు దారి తీసిందని కాంగ్రెసు సీమాంధ్ర నాయకులు లగడపాటి రాజగోపాల్, టిజి వెంకటేష్ వంటివారు విమర్సిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలో చంద్రబాబుకు ప్రజలు వ్యతిరేకంగా వ్యవహరిస్తారనే అభిప్రాయంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఉన్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో విభజనకు పాల్పడిన కాంగ్రెసు పార్టీని ఏ మాత్రం ఆదరించరని భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో సీమాంధ్ర సమైక్యవాద పార్టీగా పూర్తి స్థాయిలో సీట్లు సాధించుకోవచ్చుననే వ్యూహంలో భాగంగానే రాజీనామాల పర్వం జరుగుతోందని అంటున్నారు.
తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తగిన స్థాయి, వ్యక్తిగత బలిమి గల నాయకులు కూడా లేరు. కొండా సురేఖ దంపతులు మాత్రమే బలమైన నాయకులుగా కనిపిస్తున్నారు. వారు కూడా తెలంగాణవ్యాప్తంగా ప్రభావం చూపే పరిస్థితి లేదు. వరంగల్ జిల్లా అంతటా వారు సత్తా చాటినా చాలుననే స్థితి ఉంది. వారు తమ సొంత నియోజకవర్గంలో తమ ఆధిపత్యాన్ని తిరిగి సంపాదించుకోవడానికే కష్టపడాల్సిన స్థితి.
తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు నాయకులు కూడా కనిపించడం లేదు. పార్టీలో చేరుతారని భావించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులు కూడా అందుకు అనుగుణంగా వ్యవహరించడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వచ్చే నాయకులు ఉండకపోవచ్చునని అంటున్నారు. ఈ స్థితిలో తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించి, సీమాంధ్రలో పోగొట్టుకోవడం సరి కాదనే భావనతో వైయస్ జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సాధించిన అతి తక్కువ ఫలితాలు ఆయన మనసు మార్చినట్లు సమాచారం. ఏమైనా, ఇది వైయస్ జగన్‌కు పరీక్షా సమయమే.












Click it and Unblock the Notifications