తెలంగాణపై జగన్ ట్విస్ట్: బొత్స కౌంటర్, బాబు మౌనం

కాంగ్రెసు పార్టీ ఓట్లు, సీట్ల కోసం డ్రామాలు ఆడుతోందని, రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసేందుకు సిద్ధమైందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. అందరి ఆమోదంతోనే విభజన జరగాలని వారు ట్విస్ట్ ఇచ్చారు. విభజన విషయంలో మొదట కాంగ్రెసు పార్టీ తన అభిప్రాయం చెప్పాలని, ఆ తర్వాత ఎవరికి అన్యాయం జరగని రీతిలో ప్రతిపాదన చేయాలని, ఆ ప్రతిపాదనకు అందరి ఆమోదం కావాలని వారు డిమాండ్ చేశారు. కమలాపురం కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే వీరశివా రెడ్డి రాజీనామా కాంగ్రెసు పార్టీ డ్రామాయే అన్నారు.
మరోవైపు జగన్ పార్టీ రాజీనామాల పైన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వారి రాజనామాలు డ్రామాలంటూ కొట్టి పారేశారు. దోచుకున్న, దాచుకున్న పార్టీ అరాచక వైఖరికి నిదర్శనమే ఈ రాజీనామాలు అని మండిపడ్డారు. తెలంగాణపై మొదట ఆ పార్టీ వైఖరి చెప్పాలన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వీరశివా రెడ్డి రాజీనామా విషయం తన దృష్టికి రాలేదన్నారు. అధిష్టానం పిలుపు నేపథ్యంలో బొత్స ఢిల్లీకి వెళ్లారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఢిల్లీలోనే మకాం వేశారు.
తెలంగాణ మంత్రుల భేటీ
విభజనను అడ్డుకునేందుకు సీమాంధ్ర మంత్రులు బుధవారం భేటీ అయిన నేపథ్యంలో తెలంగాణ ప్రాంత మంత్రులు ఈ రోజు సాయంత్రం సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై వారు చర్చించారు. అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా ఉందని, ఎవరు ఆపినా ఇప్పుడు ఆగే పరిస్థితి లేదని, అలాంటి పరిస్థితి వస్తే ఏం చేయాలనే అంశంపై వారు చర్చించినట్లుగా తెలుస్తోంది.
జగన్ పార్టీ నైజం అది: జానా రెడ్డి
తెలంగాణ విషయంలో పార్టీ అధిష్టానం సంప్రదింపులు జరుపుతోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. రెండు ప్రాంతాల ప్రజలు ఆందోళనతో ఉన్నారని, ప్రజలు సమన్వయంతో ఉండాలన్నారు. కొందరు నాయకులు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది సరైనది కాదన్నారు. తెలుగువారి సామరస్యతను కాపాడి సమస్యను పరిష్కరించాలని అధిష్టానం చూస్తోందన్నారు.
అధిష్టానం నుండి పిలుపు వచ్చినా, తమకు అవసరం అనిపించినా ఢిల్లీ వెళ్తామన్నారు. జగన్ పార్టీ నైజం బయటపడిందని జానా రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు అనుకూలమని చెప్పిన ఆ పార్టీ ఇప్పుడు రాజీనామాలతో రెచ్చగొడుతోందని, దీనిని ఇరు ప్రాంతాల ప్రజలు గుర్తించాలన్నారు. ఎవరి రాజీనామాలు అవసరం లేకుండా సమస్య పరిష్కారమవుతుందని జానా ఆశించారు. తెలంగాణ కోసం తమ దూతగా ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను పంపించామన్నారు.
తెలుగుదేశం మౌనం
ఓ వైపు సీమాంధ్ర కాంగ్రెసు, తెలంగాణ కాంగ్రెసు నేతలు పోటా పోటీ భేటీలు, మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజీనామాలతో రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ వేడి రాజుకుంటే తెలుగుదేశం పార్టీ మాత్రం మౌనం దాల్చింది. పార్టీ అధినేత ఆదేశాల మేరకే నేతలు ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోదని, ఇదంతా కేవలం ప్రచారమేనని టిడిపి భావిస్తోంది. కాగా, సీమాంధ్ర నేతల భేటీపై తెలంగాణవాదులు మండిపడుతుంటే, విభజనకు వ్యతిరేకంగా నిర్ణయం ఉంటే ఆందోళనలు చేస్తామని సమైక్యాంధ్ర నేతలు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications