ఢిల్లీలో వేడి: షిండే ద్వారా సిగ్నల్స్, కిరణ్ సెప్టెంబర్ ప్లాన్!

సమైక్యవాదన వినిపించేందుకు సీమాంధ్ర మంత్రులు, విభజన సాధించేందుకు తెలంగాణ మంత్రులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సీమాంధ్ర మంత్రులు ఢిల్లీ బాటపట్టగా, అవసరమైతే ఏ క్షణమైనా ఢిల్లీలో వాలేందుకు తెలంగాణ మంత్రులు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన కోర్ కమిటీ సమావేశం జరగనుంది. తెలంగాణపై జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశం అజెండాను కోర్‌కమిటీ భేటీలో ఖరారు చేయనున్నారు.
విభజనపై తన వైఖరిని కాంగ్రెస్ అధిష్ఠానం తన వైఖరిని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ద్వారా ముగ్గురికి తెలియచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. తెలంగాణపై అధిష్ఠానం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమలు ప్రక్రియకు సహకరించండని షిండే వారిని కోరే అవకాశాలున్నాయి. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో తీసుకోవాల్సిన చర్యలపై హోంశాఖ ఇప్పటికే 80 శాతానికి పైగా కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది.
సీమాంధ్రకు చెందిన మంత్రులు వట్టి వసంత్ కుమార్, కొండ్రు మురళి, టిజి వెంకటేశ్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, శైలజానాథ్, కన్నా లక్ష్మీనారాయణ గురువారమే ఢిల్లీ చేరుకున్నారు. మరికొందరు మంత్రులు శుక్రవారం ఉదయం బయలుదేరారు. ఢిల్లీలో శుక్రవారం జరిగే కోర్‌కమిటీ సమావేశానికి ముందుగానే సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలతో సమావేశం కానున్నారు. తమ ప్రాంతంలో కాంగ్రెస్ బతకాలంటే విభజన ఆలోచన మానుకోవాలని వారు అధిష్టానానికి తెలియజేయనున్నారు.
సెప్టెంబరు తర్వాత..
కోర్ కమిటీ సమావేశం జరిగిన వెంటనే తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధిష్ఠానం భావిస్తుండగా దీనిని సాధ్యమైనంతగా అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కనీసం మునిసిపల్, జిల్లా పరిషత్ ఎన్నికలు ముగిసేదాకా ఆగాలని సెప్టెంబర్ తర్వాత నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి చేయాలని భావిస్తున్నారట.
తెలంగాణపై అధిష్ఠానం అంతిమ నిర్ణయం తీసుకున్నప్పటికీ దీనిపై బహిరంగ ప్రకటన చేస్తుందా? లేక కేంద్ర హోంశాఖకు తమ వైఖరిని తెలియజేసి, లోలోపలే విభజన ప్రక్రియ ప్రారంభిస్తారా? అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అత్యధిక సర్పంచ్ స్థానాలు దక్కాయని, సిఎన్ఎన్-ఐబిఎన్ సర్వే ప్రకారం చూసినా, తెలంగాణలో కేవలం 50 శాతం మాత్రమే అనుకూలంగా ఉన్నారని కానీ, సీమాంధ్రలో 90 శాతం మంది విభజనను వ్యతిరేకిస్తున్నారని ముఖ్యమంత్రి అధిష్టానానికి చెప్పాలనుకుంటున్నారట.












Click it and Unblock the Notifications