టిపై సిఎం డల్!: హైదరాబాద్ హోదా, దిగ్విజయ్ ట్విస్ట్
న్యూడిల్లీ: కాంగ్రెసు పార్టీ అధిష్టానం విభజన వైపు మొగ్గు చూపుతున్నట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణతో భేటీ అనంతరం, కోర్ కమిటీ భేటీ అనంతరం రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. సంప్రదింపులు ముగిశాయని, నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందని ఓసారి, ప్రభుత్వం, పార్టీ నిర్ణయం కోసం వేచిచూద్దామని మరోసారి చెప్పారు. డిగ్గీ మాటల్లో సస్పెన్స్ కనిపిస్తున్నా ఏదో నిర్ణయం తీసుకునే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయని అంటున్నారు.
డిగ్గీ, కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌లు వార్ రూమ్‌లో ముగ్గురు నేతలతో వేర్వేరుగా మాట్లాడారు. కిరణ్, బొత్సలతో అరగంట నుండి నలభై ఐదు నిమిషాలు మాట్లాడిన నేతలు దామోదరతో రెండు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. వార్ రూమ్ నుండి బయటకు వచ్చిన కిరణ్, బొత్సల్లో డల్‌నెస్ కనిపిస్తే, దామోదరలో ఉత్సాహం కనిపించింది. తద్వారా విభజన ఖాయమనే విషయం తేలిపోయిందని అంటున్నారు.

ఇప్పుడు విభజన ఏ రకంగా ఉంటుందనే అంశంపై ప్రధానంగా చర్చ సాగుతోంది. అధిష్టానం హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణతో పాటు మరో మూడు నాలుగు ప్రత్యామ్నాయలపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. విభజన ద్వారా తెలంగాణలో క్లీన్ స్వీప్ చేయడంతో పాటు సీమాంధ్రలో పూర్తిగా పట్టు కోల్పోకుండా ఉండే అంశంపై ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. ఇందు కోసం ప్రధానంగా హైదరాబాదు పైనే చర్చిస్తున్నారని తెలుస్తోంది.
పది జిల్లాల తెలంగాణతో పాటు, అనంతపురం, కర్నూలు జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఇవ్వడంపై ఆలోచిస్తోందని అంటున్నారు. అదే సమయంలో సీమాంధ్రలో పట్టు నిలుపు కోవడం కోసం హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచడం, విభజించి పదేళ్ల పాటు రాజధానిగా ఉంచడం పైన తర్జన భర్జన పడుతున్నట్లుగా సమాచారం. ఢిల్లీ తరహా హైదరాబాదు పైన కూడా చర్చిస్తోందని తెలుస్తోంది. ప్రత్యేక హోదా ఇస్తే కేంద్రం చేతిలో హోంశాఖ, లా అండ్ ఆర్డర్ ఉంటాయి.
కిరణ్ డల్ - సీమాంధ్రకు ఏం కావాలి!?
వార్ రూమ్ భేటీ అనంతరం కిరణ్, బొత్సలు డల్‌గా కనిపించారు. తనను కలిసిన సీమాంధ్ర నేతలతో విభజనపై నిర్ణయం జరిగిపోయిందని కిరణ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. సీమాంధ్రకు ఏం కావాలో చెప్పాలని పెద్దలు ప్రశ్నిస్తున్నారని చెప్పారట. స్థానిక సంస్థల ఎన్నికల వరకు కూడా ప్రకటనను వాయిదా వేసే అవకాశాలు లేవని, రాజధాని ఎక్కడ అనే దానిపై నిపుణులతో కమిటీ వేస్తామని చెప్పారని, సోనియాకు లేఖ రాయాలని సీమాంధ్ర మంత్రులతో చెప్పారట. నేతలతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాదుకు బయలుదేరారు.
యూపిఏ ట్విస్ట్!
ఓ వైపు విభజనపై జోరుగా ప్రచారం జరుగుతున్నా, డిగ్గీ ప్రకటన చేసినా యూపిఏ పార్టీల ట్విస్ట్ కొత్తగా తెర పైకి వచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు. యూపిఏ పార్టీలతో చర్చించిన తర్వాత అని మెలిక పెట్టి ఆలస్యం చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు. డిగ్గీ వేచిచూద్దామనే వ్యాఖ్యల్లో అంతరార్థం అది కూడా కావొచ్చునని అంటున్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షం బిజెపి తెలంగాణ బిల్లుకు మద్దతిస్తామని చెప్పినందున ఆలస్యం అవకాశాలు లేవని మరికొందరు అంటున్నారు.












Click it and Unblock the Notifications