సోనియాకి సీమాంధ్ర నేతల ఘాటు లేఖ, కోర్‌కమిటీ భేటీ
న్యూఢిల్లీ: విభజనపై ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి శుక్రవారం సాయంత్రం ఓ లేఖ రాశారు. కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు ఇంట్లో సీమాంధ్ర మంత్రులు భేటీ అయ్యారు. అనంతరం వారు ప్రత్యేక దూత ద్వారా తమ లేఖను పంపించారు.
ఏకపక్షంగా తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే తాము పార్టీకి, పదవులకు రాజీనామాలు చేస్తామని వారు తమ లేఖలో హెచ్చరించారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా పార్టీకి ఆ ప్రాంతంలో ఒరిగేదేమీ లేదని, పైగా సీమాంధ్రలో పూర్తిగా నష్టపోవాల్సి ఉంటుందని వారు లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.

అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం పెడితే వ్యతిరేకిస్తామని, పార్లమెంటులో బిల్లును కూడా వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు. చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఉండే పార్లమెంటు సభ్యులను కూడగడతామని పేర్కొన్నట్లుగా సమాచారం. లేఖపై రాష్ట్ర మంత్రులు, ఐదుగురు ఎంపీలు సంతకం చేశారు.
విశ్వసించడం లేదు: నాగం
కాంగ్రెసు పార్టీని తాము పూర్తిగా విశ్వసించడం లేదని బిజెపి నేత, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి హైదరాబాదులో అన్నారు. డ్రామాలు ఆడకుండా తెలంగాణ ఇవ్వాలని ఆయన కాంగ్రెసు పార్టీపై మండిపడ్డారు. బిజెపి అధికారంలోకి వస్తుందని, తెలంగాణను అభివృద్ధి చేస్తుందన్నారు.
రాజీనామాలొద్దు: విహెచ్
సీమాంధ్ర నేతలు రాజీనామా ఆలోచనలు చేయవద్దని కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు శుక్రవారం న్యూఢిల్లీలో అన్నారు. ఓట్ల కోసం రాష్ట్రాన్ని చీల్చుతున్నారనే వాదన సరికాదన్నారు.
కోర్ కమిటీ సమావేశం
ప్రధాని కార్యాలయంలో సాయంత్రం ఐదు గంటలకు కోర్ కమిటీ భేటీ అయింది. సోనియా గాంధీ, ఆ పార్టీ నేతలు సుశీల్ కుమార్ షిండే, అహ్మద్ పటేల్, ఎకె ఆంటోనీ, చిదంబరంలు హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్‌లు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications