తెలంగాణ: షిండే నోట్ సిద్ధం, వార్‌రూమ్‌లో చర్చలు

కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షిండే కోర్ కమిటీకి కీలక నోట్ సమర్పించనున్నారని అంటున్నారు. ఈ నోట్‌ను కోర్ కమిటీ ఆమోదించిన తర్వాత దానినే వర్కింగ్ కమిటీ సభ్యుల ముందు పెడతారట.
తెలంగాణ ఉద్యమ నేపథ్యం, దానివల్ల ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలు, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయం తీసుకునేందుకుగల కారణాలు ఈ నోట్‌లో ఉంటాయని సమాచారం. రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ నేతృత్వంలో తెలంగాణపై ఏర్పాటు చేసిన ఉన్నతాధికార కమిటీ వార్ రూమ్‌లో సమావేశమవుతుంది.
ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఆంటోనీ, సుశీల్ కుమార్ షిండే, చిదంబరం, గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ తదితరులు వార్ రూమ్‌లోనే బొత్స, కిరణ్, దామోదరలకు పరిస్థితిని వివరిస్తారని అంటున్నారు. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం తప్ప గత్యంతరం లేదని, ఇతర సమస్యలకు ఆస్కారం ఇవ్వవద్దని వారు రాష్ట్ర నేతలకు చెప్పనున్నారట.












Click it and Unblock the Notifications