విభజన: ఆ ముగ్గురి సైలెన్స్ వెనుక...! (పిక్చర్స్)
హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై ఒంటి కాలిపై లేచే విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు, కేంద్రమంత్రి, ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావులు ఇప్పుడు మౌనం వహిస్తున్నారు.
అధిష్టానం విభజన వైపే మొగ్గు చూపుతున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇలాంటి సమయంలో వారు సైలెన్సుగా ఉండటం చర్చకు దారి తీసింది. తాను అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కావూరి కేంద్రమంత్రి అయ్యాక చెప్పారు. పది రోజుల క్రితం లగడపాటి విభజనపై ఘాటుగా స్పందించారు. తెలుగు తల్లిపై కత్తి వేలాడుతోందని వ్యాఖ్యానించారు. సమైక్యవాద రాయపాటి కూడా కనిపించడం లేదు.
అయితే వారు మౌనం వెనుక ఏముందనే చర్చ సాగుతోంది. పది జిల్లాలతో కూడిన తెలంగాణ కాకుండా అధిష్టానం రాయల తెలంగాణ, హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం, ఉమ్మడి రాజధాని అంశాలను పరిశీలిస్తుందేమో అనే చర్చ సాగుతోంది. విభజన జరిగినా తమకు కొంత అనుకూలంగా ఉండేలా నిర్ణయం ఉండటం వల్లనే వారు మౌనం వహిస్తున్నారా లేక అధిష్టానం మొట్టికాయలతో వెనక్కి తగ్గారా అనేది హాట్ టాపిక్‌గా మారింది.

విభజనపై చర్చోపచర్చలు
రాష్ట్ర విభజనపై గల్లీ నుండి ఢిల్లీ వరకు జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఢిల్లీ పరిణామాలను రాష్ట్ర ప్రజలు సైతం ఆసక్తిగా గమనిస్తున్నారు. ఏం జరుగుతుందోననే ఉత్కంఠ చాలామందిలో కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో సమైక్యవాదం గట్టిగా వినిపించిన ముగ్గురు ముఖ్య నేతలు మాత్రం మౌనం వహించారు.

లగడపాటి రాజగోపాల్
విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మొదటి నుండి సమైక్యవాదం వినిపిస్తున్న నేత. పది రోజుల క్రితం విభజనపై విపక్షాలను ఏకీపారేసిన లగడపాటి అప్పటి నుండి ఢిల్లీకే పరిమితం అయినట్లుగా కనిపిస్తోంది. విభజనపై ఓ నిర్ణయానికి వచ్చిన అధిష్టానం లగడపాటిని మాట్లాడవద్దని ఆదేశించినందు వల్లనే ఆయన మౌనం వహించి ఉంటారని అంటున్నారు.

రాయపాటి సాంబశివ రావు
గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు పక్కా సమైక్యవాది. ఆయనకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఆదేశాల మేరకు ఆయన మౌనం వహిస్తున్నారని అంటున్నారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం అతను విదేశాలకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.

ఉండవల్లి అరుణ్ కుమార్
రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఇందుకోసం ఆయన పలు సమావేశాలను, సభలను కూడా నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఇతర సీమాంధ్ర నేతలతో కలిసి సమైక్యం కోసం లాబీయింగ్ చేస్తున్నారు.

కావూరి సాంబశివ రావు
కేంద్ర జౌళి శాఖ మంత్రి, ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు సమైక్యవాది. అయితే కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆయన యూ టర్న్ తీసుకున్నారనే చెప్పవచ్చు. అంతకుముందు సమైక్యం కోసం దేనికైనా సిద్ధమన్న కావూరి.. ఇప్పుడు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు.












Click it and Unblock the Notifications